Vishnuvardhan Reddy :
బీజేపీ, జనసేన ఇంకా కలిసే ఉన్నాయని, రెండు పార్టీలు వ్యూహంతో ముందుకెళ్తున్నాయని బీజేపీ ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అయితే ఇక్కడ ఈ రెండు పార్టీలు విడాకులు తీసుకోకుండా దూరంగా ఉంటున్నాయని, ఎప్పుడు కలుస్తాయో.. ఎప్పుడు విడిపోతాయో తెలియని బంధం లా వీరి ప్రయాణం కొనసాగుతున్నదని అంతా సెటైర్లు వేస్తున్నారు.
పవన్ ఓ వైపు టీడీపీతో చెట్టాపట్టాల్ వేసేందుకు చూస్తుంటే, బీజేపీ మాత్రం మా బంధమే ఫస్ట్ అంటూ ఇంకా మీటింగుల్లో చెప్పుకుంటూ పోతున్నది. దీనిపై తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
బీజేపీ ఏపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విధం గా మాట్లాడారు. 2024 ఎన్నికల్లో అధికార వైసీపీని బలంగా ఎదుర్కొవడం పై నే మా దృష్టి ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై చార్జీషీట్ ను బలంగా జనంలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఇక ఏపీలో కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి సారథ్యంలో పార్టీ కొత్త ప్రయాణం మొదలుపెట్టడం స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇక పార్టీ బలోపేతమే లక్ష్యంగా తమ అడుగులు ఉంటాయని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 23న రాయలసీమ, 25న కోస్తాంధ్ర, 26న రాజమండ్రి, 27న విశాఖలో పర్యటిస్తారని, ముఖ్య నేతల సమావేశాలు కొత్త అధ్యక్షురాలి సారథ్యంలో కొనసాగుతాయని చెప్పారు.
సీఎంగా జగన్ అసలు రాష్ర్ట ప్రజలకు చేసిందేమి లేదని మండిపడ్డారు. ఇక రానున్న రోజుల్లో ప్రజల్లోనే ఉంటామని, ఈ తొమ్మిది నెలల పాటు వైసీపీ ప్రభుత్వంపై పోరు చేపడుతామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతున్నదని తెలిపారు.
బీజేపీతో జనసేన కలిసి నడుస్తుందని స్పష్టం చేశారు. ఈనెల 18న ఢిల్లీలో జరిగే ఎన్డీఏ భేటీలో పవన్ పాల్గొంటారని, ఇప్పటికే ఆయనకు ఆహ్వానం కూడా అందిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఏపీలో ఈ రెండు పార్టీలు బలమైన శక్తులుగా మారబోతున్నాయని స్పష్టం చేశారు.
పవన్ చేపట్టిన వారాహి యాత్రను బీజేపీ కూడా స్వాగతిస్తున్నదన్నారు. ఇక చివరగా పొత్తుల అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని తేల్చేశారు. అయితే తమకేదో వ్యూహం ఉందంటూ విష్ణువర్ధన్ రెడ్డి అనడంపై ఇప్పుడు చర్చ సాగుతున్నది. అయితే ఈ వ్యూహం ఎవరిపై అధికార వైసీపీ పైనా లేదంటే ప్రతిపక్ష టీడీపీ పైనా అనేది తేలాల్సి ఉంది.
ఇప్పుడు ఏపీలో వైసీపీ. టీడీపీ మాత్రమే బలమైన పార్టీలుగా ఉన్నాయి. ఇందులోకి బీజేపీ, జనసేన రావాలని అనుకుంటున్నాయి. ఈ కోణంలో ఏదైనా ప్లాన్ చేశారా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఇటీవల వలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయంటూ ఆయన బాంబు పేల్చారు.
మరి కేంద్ర నిఘా సంస్థలు కేంద్రంలోని బీజేపీ నాయకులకు చెప్పకుండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎందుకు చెప్పాయంటూ ఇప్పుడు ప్రశ్నలు మొదలయ్యాయి. పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.
బీజేపీకి ఈ విషయం తెలిసినా బయటకు చెప్పకపోవడం పై పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి బీజేపీ, జనసేన మధ్య అంతా ఒకే గా అంటూ ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. వీరి బంధం ఇంకా ఉన్నట్లేగా అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మేం ఇంకా కలిసే ఉన్నాం అంటూ బీజేపీ విష్ణువర్ధన్ ప్రకటించి, ఏదో చెప్పే ప్రయత్నమైతే చేశారు. రానున్నరోజుల్లో వీరి బంధం ఎన్నికల ముందు తేలనుంది.