BJP high command : తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపికపై హైకమాండ్ బిగ్ టాస్క్ ఇచ్చింది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతల సత్తాకు ఇది పరీక్షగా చెప్పుకుంటున్నారు. ఈ పోటీ ఇప్పుడు కమలం పార్టీలో ఆసక్తికరంగా మారింది. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలనే ప్లాన్ తో పోటీగా టాస్క్ నెగ్గేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారిన టాస్క్ ఏంటో చూద్దాం. తెలంగాణపై కమలం పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. అందుకే కొత్త అధ్యక్షుడిగా సరైన నేతను ఎంపిక చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్న బీజేపీ నేతలు… కార్యకర్తల్లో బలమైన నాయకుడికి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలందరికీ పార్టీ సభ్యత్వ నమోదు పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణలో గత కొన్నేళ్లుగా బలం పుంజుకుంటున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం గత ఎన్నికల్లో పోలైన 70 లక్షల ఓట్లను పార్టీ సభ్యత్వాలుగా మార్చాలని ఆశిస్తోందంటున్నారు. ఈ టార్గెట్‌ను చేరుకోడానికి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావుతోపాటు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలా కాలంగా భావిస్తున్నారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నేతగా ఎదగాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన ఈటల.. బీజేపీలో చేరినప్పటి నుంచి అధ్యక్ష పదవిపై గురిపెట్టారు. పార్టీ కూడా ఆయనకు ఆ స్థాయి గౌరవాన్ని ఇచ్చింది. కానీ, కాషాయ సిద్ధాంతాలను అనుసరిస్తూ ఇప్పటి వరకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా కాలం గడిపేస్తుంది. ఆయనకు పోటీగా మరో ఇద్దరు ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నందున ఈ నలుగురికి పార్టీ అధిష్టానం టాస్క్ ఇచ్చినట్లు సమాచారం.
రాష్ట్రంలో 70 లక్షల సభ్యత్వానికి చేరుకోవాలంటే.. ప్రతి బూత్‌లో కనీసం 200 మంది కార్యకర్తలు ఉండాలని కమలం పార్టీ భావిస్తోంది. దీంతో పార్టీ అగ్రనేతలంతా రంగంలోకి దిగి పార్టీ సభ్యత్వ నమోదును యజ్ఞంలా చేస్తున్నారు. ఎంపీ ఈటలతోపాటు రఘునందన్‌రావు, అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, మరికొందరు నేతలు సభ్యత్వ నమోదును సవాల్ గా తీసుకున్నట్లు సమాచారం. తమ నియోజకవర్గాలతో పాటు అనుచరుల ద్వారా ఎక్కువ సభ్యత్వాలు చేయించి అగ్రనేతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం బీజేపీ ఆనవాయితీ. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తారు. ఇప్పుడు కూడా మరిన్ని సభ్యత్వాలు నమోదు చేసి జాతీయ పార్టీ నేతలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఈ నెల 9న ప్రారంభమైన సభ్యత్వ నమోదు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. ఈ క్రమంలోనే ఒక్కో బూత్ స్థాయిలో 200 సభ్యత్వాల నమోదు సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండడంతో క్రమంగా బలపడుతున్నారనే భావనతో నేతలు దూసుకుపోతున్నారు. మొత్తానికి ఈ పరీక్షలో ఎవరు విజయం సాధిస్తారనేది చూడాలి.