HYDRA : హెచ్ ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యంగా రంగంలోకి దిగిన హైడ్రా.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తుంది. దీనిని ఎక్కువ శాతం ప్రజలు స్వాగతిస్తున్నారు. రాజకీయ నేతలు సైతం పార్టీలకతీతంగా మద్దతు ప్రకటిస్తున్నారు. కానీ బీజేపీలో మాత్రం ‘హైడ్రా’పై అయోమయం నెలకొంది. ఈ అంశంపై కాషాయ పార్టీ నేతలు తలోదారిలో వెళ్తున్నారు. కొందరు నేతలు సపోర్ట్ చేస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రాష్ట్ర నాయకత్వం కూడా స్పష్టమైన వైఖరి ఎంటో వెల్లడించడం లేదు.. గతంలో రుణమాఫీపైనా శ్రేణుల్లో ఇలాంటి సందిగ్ధతే నెలకొంది. తాజాగా హైడ్రాపైనా ఇలాంటి గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాన్ని వారు తెలుపుతున్నారు.
బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఏ అంశంలోనైనా పార్టీ శ్రేణులకు మార్గదర్శకాలు ఇవ్వాల్సిన రాష్ట్ర శాఖ.. ఏమాత్రం పట్టించుకోవడం లేదని టాక్. రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల హైడ్రామాపై ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారని చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టే అస్త్రాలను ప్రయోగించడంలో ఆ పార్టీ విఫలమైందనే టాక్ వినిపిస్తోంది. అధిష్టానం నుంచి స్పష్టత రాకపోవడంతో సొంత ఒపీనియన్ కే శ్రేణులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెబుతున్న కారణంగానే నేతల మధ్య ఐక్యత లేదన్న విమర్శ మరింత బలపడుతోంది. ఇది పార్టీకి నష్టం కలిగించే అంశంగా మారింది. అయితే పలు వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేలా ఉండడంతో నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ హైడ్రా నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపట్టారు. అడ్డగోలుగా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీ హైడ్రామా చేస్తోందని.. దమ్ముంటే పాతబస్తీలోని ఎంఐఎం అధినేత ఒవైసీకి చెందిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తన , మన అనే బేధం లేకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుండగా.. ఇంకా ఓ సెక్షన్ నేతల కట్టడాలను కూల్చివేస్తేనే హైడ్రాకు విశ్వసనీయత ఉంటుందనే విధంగా బీజేపీ శ్రేణులు కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. జరుగుతున్న ప్రతీదాన్ని మత కోణంలో చూడటం ఏమంత మంచిది కాదని..కానీ బీజేపీ ఇప్పుడు ఇదే చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒవైసీ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేయడంతోపాటు అలా చేస్తేనే హైడ్రాకు విశ్వసనీయత ఉంటుంది అంటే.. ఇప్పటి వరకు అక్రమ కట్టడాల కూల్చివేతలను బీజేపీ వ్యతిరేకించినట్లే అవుతుందన్న అభిప్రాయం బలపడుతోంది. అక్రమ కట్టడాల నిర్మూలన కు తీసుకొచ్చిన హైడ్రాకు కూడా మతం రంగు పులిమేలా రాజకీయం చేయాలనుకోవడం దివాలాకోరు తనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.