BJP strategy :
దాదాపు మరో ఆరు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నగారా మోగబోతోంది. నాయకులు, కార్యకర్తలకు ఐదేళ్ల పండుగ రాబోతోంది. ఇప్పటి నుంచే వివిధ పార్టీలు మాటల కత్తులు నూరుతూ వాటికి పదును పెడుతూ సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు ఈ సారి తెలంగాణలో తలపడబోతున్నాయి. రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఈ సారి హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని చూస్తుంటే.. ఆ పప్పులు ఉడకవని బీజేపీ, కాంగ్రెస్ చెప్తున్నాయి. అందుకు తగ్గ కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నాయి.
కొన్నేళ్ల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లేదు. ప్రతీ సారి టీడీపీతో పొత్తు పెట్టుకుంటూ తెలంగాణలో పట్టు కోల్పోయింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు అధిష్టానం అహర్నిశలు కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గురించి పక్కన పెడితే తెలంగాణలో బీజేపీ భవితవ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్.. తెచ్చింది టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఈ సెంటిమెంట్ లో బీజేపీ కనిపించలేదు.. కనీసం వినిపించనూ కూడా లేదు. దాదాపు రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీజేపీ తెలంగాణలో కొంచెం పుంజుకోగలిగింది. బండి సంజయ్ పార్టీ తెలంగాణ పగ్గాలు చేపట్టిన తర్వాత గ్రామ గ్రామానికి బీజేపీని తీసుకెళ్లడంతో విజయం సాధించారనే చెప్పాలి. ప్రజా సంకల్ప యాత్రల పేరుతో ఆయన ఓటు బ్యాంకును క్రమ క్రమంగా పెంచుకుంటూ వచ్చారు. గతంలో బీజేపీకి ఓట్లే లేని చోట ఇప్పుడు కనీస ఓటు బ్యాంకు ఉందంటే అదంతా అధ్యక్షుడితో సహా ముఖ్య నాయకులు, కార్యకర్తల కృషి అనే చెప్పాలి.
కర్ణాటక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగిన పోరు. కర్ణాటక గెలుపు తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. దీంతో బీజేపీ అధిష్టానానికి అంతుపట్టడం లేదు. బడా నాయకులు, వారి అనుచర గణం కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. మొన్నటి వరకు ఊపు ఊపిన బీజేపీ ఇప్పుడు చతికిల పడింది. ఎలాగైనా తెలంగాణను విడిచిపెట్టేది లేదంటూ బీజేపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. నిన్న రాత్రి (జూన్ 28) నుంచి దాదాపు ఉదయం వరకు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు వివిధ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. త్వరలోనే తెలంగాణలో గెలుపునకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.