BJP తెలంగాణ బీజేపీలో మూడు ముక్కలాట కొనసాగుతున్నది. ఇటీవల పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పార్టీలో అంతర్గత పోరు వల్లే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని అందరికీ తెలిసిందే. అయితే అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేసిన ఈటలను కాదని, కిషన్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించారు. ఈటెలకు ఎన్నికల కమిటీ చైర్మన్ అంటూ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఒక్కటి మాత్రం అర్థమవుతున్నది. పాతవారిని కాదని కొత్తవారికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఊహించే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం అవుతున్నది. ఇందులో అధిష్టానం మాత్రం బ్యాలెన్స్డ్ వ్యూహం పన్నింది.
బీజేపీ వ్యూహాలు విభిన్నంగా ఉంటాయి. సీఎం అభ్యర్థిని కూడా వారు లాస్ట్ వరకు తేల్చకుండా ఏదో ఒక వ్యూహంతో ముందుకెళ్తారు. యూపీ ఎన్నికల్లో కూడా మొదటిసారి యోగి పేరు చివరి వరకు కూడా తెలియదు. కర్ణాటకలో గత ఎన్నికల్లో యడ్యురప్ప పేరు తెరపైకి తెచ్చినా, ఈసారి అసలు సీఎం అభ్యర్థి పేరే ప్రకటించలేదు. రాజస్థాన్లో సీఎం వసుంధార రాజే పేరును ఇప్పటివరకు ప్రకటించలేదు. సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చకుండానే ఈసారి ఎన్నికల్లోకి వెళ్తున్నారు. కానీ మధ్య ప్రదేశ్లో మరోసారి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరునే ప్రకటిస్తున్నారు. అసలు ఒక్క సీటు కూడా గెలవలేని కేరళ లాంటి రాష్ర్టంలో కూడా మెట్రోమ్యాన్ శ్రీధరన్ ను పార్టీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. సందర్భానుసారం వ్యూహాన్ని అనుసరిస్తుంటారు.
మరి తెలంగాణలో రాజకీయాలపై బీజేపీ ప్రత్యేక ప్లాన్ తో వెళ్తున్నది. సీఎం అభ్యర్థిత్వంపై కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ లాంటి వారు తమ ప్రచారం తాము చేసుకుంటున్నారు. అయితే కొత్త వారికి అవకాశాలు వస్తాయా లేదా అనేది పక్కన పెడితే, బీజేపీలో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారికే ఈ అవకాశం దక్కుతుందనే పేరైతే ఉంది. అందువల్ల ఈటలకు కొంత అవకాశం లేదు. అందుకే కిషన్ రెడ్డికి అవకాశం ఉంటుందని ఓ వర్గం భావిస్తున్నది. అయితే ఈటల రాజేందర్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే మరో వర్గం మాత్రం బండి సంజయ్ మార్పును ఖండిస్తున్నారు.
వరంగల్ లో బండి సంజయ్ కు వచ్చిన ఆదరణ చూసి, అధిష్టానం ఆలోచనలో పడిందని అంతా అనుకుంటున్నారు. బండికి కేంద్ర మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందో అని అంతా ఊహాగానాల మధ్యనే ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీలో పదవులపై ఆశలు పెట్టుకున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వీరి ముగ్గురితో పాటు డీకే అరుణ, రఘునందన్ రావు లాంటి వారు కూడా తెరపైకి వస్తున్నారు. మరి ఎన్నికల వేళ ఇదంతా పార్టీకి పెద్ద తలనొప్పే.