DJ Tillu : ‘డీజే టిల్లు’ పేరు వినగానే కుర్రకారు ఉర్రూతలూగుతున్నారు. ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా ‘డీ జే టిల్లు’ మూవీ సాంగ్స్ ఉండాల్సిందే. డీ జే టిల్లు గా సిద్దు నటన అందరినీ ఆకర్షించింది. ఆ సినిమాతో యూత్ లో అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందగలిగాడు సిద్దు.
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తాజాగా నీరజ కోన దర్శకత్వంలో ఓ సినిమాకి సంతకం చేశాడు. ఈ చిత్రం సెట్స్ పైకి రాకముందే మరో అద్భుతమైన ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడు సిద్దు. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న వార్తలు నిజమైతే, సిద్ధూ ప్రఖ్యాత దర్శకుడు “బొమ్మరిల్లు” భాస్కర్‌తో రాబోయే ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేస్తాడు. దీని పై వీరిద్దరి మధ్య కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. వీరిద్దరు కలిసి కలకాలం గుర్తిండిపోయే ప్రాజెక్ట్‌ను అందించడానికి ఆసక్తిగా ఉన్నారు.
ఇండస్ట్రీ లో టాక్ ప్రకారం చాలా మంది ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఆగస్టులో అధికారికంగా ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు నిర్మాణ పర్యవేక్షణలో ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరుగనున్నాయి. అయితే ఆ ప్రాజెక్ట్ లో వచ్చే సినిమా మునుపెన్నడూ లేని విధంగా కొత్త కధాంశంతో రాబోతుందని సిని వర్గాల అంచనా.
మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్‌లో నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన “టిల్లు స్క్వేర్” విడుదల తేదీని మూవీ యూనిట్ ఇంకా ఖరారు చేయలేదు. అన్నీ అనుకూలంగా ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని చిత్ర బృందం తెలిపింది..