BRS, Congress ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కరెంట్ వార్ కొనసాగుతున్నది. నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య వాతావారణం వేడెక్కింది. అధికార పార్టీ అయితే కరెంట్ ఇష్యూని తెరపైకి తెస్తూ ఇందులో రేవంత్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నది. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఇందులోకి లాగుతున్నది. అయితే బీఆర్ఎస్ దాడికి కాంగ్రెస్ నుంచి ఆశించినస్థాయిలో ఎదురుదాడి లేదు. రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినా అంతగా పేలలేదు. అయితే ఈ రెండు పార్టీలదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చసాగుతున్నది.
అయితే ఇప్పుడు రాష్ర్టంలో బీజేపీ ప్రస్తావన అనేదే లేకుండా పోయింది. ఆ పార్టీ కూడా అదేస్థాయిలో ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక నాయకులెవరూ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలకు మరో మూడు నెలలే గడువు ఉన్న సమయంలో ఇలా బీజేపీ సైలెంట్ కావడం వెనుక బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందం ఉందనేది కాంగ్రెస్ శ్రేణుల వాదన. యుద్ధానికి ముందే బీజేపీ అస్ర్తాలను పక్కన పెట్టేసిందని వారు ఎద్దేవా చేస్తున్నారు.
ఇటీవల టిఫిన్ బాక్స్ మీటింగ్ లు నిర్వహించాలని అధిష్టానం ఆదేశించింది. అయితే అసలు అధ్యక్షుడు విదేశీ పర్యటనలో ఉండడంతో దానిని ఎవరూ పట్టించుకోలేదు. ఇక మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అసంతృప్తితో సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తున్నది. కరెంట్ సమస్య విషయంలో బీజేపీ ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. దీనికంతటికీ కారణం పార్టీ జాతీయ నాయకత్వమే నని ఆ పార్టీ శ్రేణులు కూడా గుర్రుగా ఉన్నారు. పార్టీ బీఆర్ఎస్ పై గట్టి గా పోరాడుతుంటే ఒక్కసారిగా నీళ్లు పోశారని వారంతా మండిపడుతున్నారు.