
BRS Leaders : ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై నిరసనలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల్లో కూడా టీడీపీకి ఆదరణ పెరుగుతోంది. తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్టుపై నిరసనలు తీవ్రమయ్యాయి. వైసీపీ నేతల తీరును అందరు ఖండిస్తున్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీ నిర్వహించడం గమనార్హం.
ఎల్బీనగర్ లో టీడీపీ మద్దతుతోనే తాను గెలిచానని భావించి వారికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి కూడా చంద్రబాబు అరెస్టుపై విమర్శలు చేశారు. జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఖమ్మం, నల్లగొండ, కోదాడ, నిజామాబాద్ వంటి చోట్ల కూడా భారీ ర్యాలీలు నిర్వహించారు. వీటికి బీఆర్ఎస్ నాయకులే నాయకత్వం వహించడం విశేషం.
హైదరాబాద్ లోని కుషాయిగూడ సహా పలు కాలనీల్లో ఉంటున్న వారు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తన్నారు. బాబు అక్రమ అరెస్టును ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటి బీఆర్ఎస్ నాయకులే గతంలో టీడీపీ కార్యకర్తలు కావడంతో తమ అభిమాన నేత అరెస్టును నిరసిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ అగ్రనేతలు మాత్రం ఇంతవరకు బాబు అరెస్టుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
మొత్తానికి తెలంగాణలో కూడా చంద్రబాబుకు చాలా మంది సానుభూతిపరులు ఉన్నట్లు తెలుస్తోంది. బాబు అరెస్టుపై భగ్గుమంటున్నారు. జగన్ తీరును నిరసిస్తున్నారు. అధికార పక్షం దురుద్దేశంతోనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే నిరాధార ఆరోపణలతో అరెస్టు చేయడంపై అందరు స్పందిస్తున్నారు. భవిష్యత్ లో దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.