BRS MLA Nandita Died : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. కారు ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
ఇటీవలే ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. నల్గొండ బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా నార్కట్ పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
లాస్యనందిత దివంగత నేత సాయన్న కుమార్తె. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈమె గద్దర్ కుమార్తెపై విజయం సాధించిన విషయం తెలిసిందే.
నందిత అకాల మరణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. లాస్య నందిత మృతిపై మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.