
BRS party : జాతీయ రాజకీయాల వైపు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. తొలుత మహారాష్ట్ర లో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభలకు పెద్ద ఎత్తున మహారాష్ర్ట ప్రజల నుంచి ఆదరణ లభించింది. దీంతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలను బీఆర్ఎస్లో కి ఆహ్వానించి, గులాబీ కండువా కప్పారు. పార్టీ బలోపేత బాధ్యతలను అక్కడి నేతలకు అప్పగించారు. అయితే గులాబీ అధినేత తాజాగా శుక్రవారం నుంచి రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఇందుకోసం స్వయంగా నాందేడ్ కు వెళ్లారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఈసారి గెలిపించుకోవాలని అక్కడి ప్రజలను కోరుతున్నారు
అయితే తొలి అడుగులోనే బీఆర్ఎస్ (BRS party ) మహారాష్ట్రలో విజయం సాధించింది. మహారాష్ట్రలో జరిగిన ఉప ఎన్నికల్లో తన ఖాతా తెరిచింది. ఔరంగాబాద్ సమీపంలోని గంగాపూర్ తాలూకా అంబేలోహార్ గ్రామపంచాయతీ ఒకటో వార్డుకు గురువారం ఎన్నికలు జరగగా శుక్రవారం ఫలితం వెల్లడైంది. ఈ ఫలితాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పటాన్ 115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు నిన్నంటాయి. తొలి ఎన్నికల్లోనే పార్టీ ఖాతా తెరవడం అందరినీ సంతోషంలో ముంచింది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గెలిచిన అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచే మొదటి అడుగు విజయవంతంగా మొదలు పెట్టామని శ్రేణులు భావిస్తున్నాయి.
మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలు, జిల్లాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడి సమస్యలపై ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. బహిరంగ సభల్లో ఇక్కడి సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ గెలిస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తామని ప్రజలకు భరోసానిస్తున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ, శివసేనలకు దీటుగా బీఆర్ఎస్ ను తీర్చి దిద్దాలని కసరత్తు ప్రారంభించారు.