BRS : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. వంద మీటర్ల లోతులో బీఆర్ఎస్ ను బొంద పెట్టడం ఖాయమని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ మేరకు స్పందించారు. దేశ సరిహద్దులు దాటినప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దని అనుకున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల రీత్యా మాట్లాడక తప్పడం లేదని చెబుతున్నారు.
కుటుంబ పాలనకు చరమగీతం పాడటంతో వారు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. ఇన్నాళ్లు అవినీతి, అక్రమాలు, బంధుప్రీతితో కాలం గడిపిన వారికి అధికారం దూరం కావడంతో తట్టుకోలేకపోతున్నారన్నారు. వంశపారంపర్యంగా వచ్చిన పదవి కాదని కష్టపడి సాధించుకున్నదని చెప్పారు. వారి కుటుంబ పాలన దూరం కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాలతో పోటీ పడకుండా ప్రపంచంతోనే తమ పోటీ ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ వారసత్వ సంపదకు ప్రవాసులే ప్రచారకులన్నారు. ప్రవాసుల చేయూతతో రాష్ట్రం డెవలప్ మెంట్ జరుగుతుందని తెలిపారు. ఎన్ఆర్ఐల సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆరు గ్యారంటీల అమలులో వెనకడుగు వేసేది లేదన్నారు. వంద రోజుల్లో వీటిని అమలు చేసి తీరుతామని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐ లు ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర డెవలప్ మెంట్ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయడం ఖాయమని తన అభిప్రాయం వెల్లడించారు.