
CM Cup-2023 : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం ఏ అంశాన్ని వదలడం లేదు పార్టీ అధినేత. దశాబ్ది ఉత్సవాల పేరుతో 21 రోజుల పాట ప్రభుత్వ డబ్బుతో వేడుకలు నిర్వహిస్తూ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాలకంటే ముందు యూత్ ను ఆకర్షించుకునేందుకు ‘సీఎం కప్-2023’ పేరుతో క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ కప్ ద్వారా యువతను ఆకర్షించుకోవచ్చని ప్లాన్ చేశారు. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
పార్టీ పనితీరు, వచ్చే ఎన్నికల్లోల గెలుపు ఓటములు ఇలా ప్రతీ అంశంపై వచ్చిన సర్వే రిపోర్ట్ ద్వారా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. ఇందులో భాగంగా ఇటీవల యువతపై నిర్వహించిన సర్వే ప్రతి కూలంగా వచ్చింది. రీసెంట్ గా ఓటు హక్కు పొందిన యువత బీఆర్ఎస్ కు దూరంగా ఉంటుందని తేలింది. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ ప్రభుత్వ తీరుతో వారు మండిపడుతున్నారని తెలుస్తోంది. దీనికి తోడు యువత చాలా వరకు కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరందరినీ ఆకర్షించుకోవాలని ఒక భారీ పథకం వేశారు కేసీఆర్. అదే సీఎం కప్ నిర్వహణ.
యువతను తమ వైపునకు తిప్పుకునేందుకు ‘సీఎం కప్-2023’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో వివిధ అంశాలపై క్రీడా పోటీలు నిర్వహించారు. పాల్గొన్న ప్రతీ ఒక్కరికి టీషర్టులు, తిండి, టీ, పానియాలు ఇలా అన్ని ఏర్పాట్లు చేశారు. దీని కోసం రూ. 20 కోట్లు కేటాయించారు. ఇందులో క్రీడా శాఖ నుంచి రూ.2.5 కోట్లు కేటాయించగా, మిగతా డబ్బులను స్థానిక నాయకులు పెట్టుకున్నారు. క్రీడల నిర్వహణ బాధ్యతలను కూడా సంబంధిత శాఖకు అప్పగించారు. మే 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించారు. ఇందులో 3.5 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న క్రీడాకరుల వివరాలు, సెల్ ఫోన్ నెంబర్లను తీసుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. వారితో రెగ్యులర్ టచ్ లో ఉండాలని భావిస్తున్నారు.
ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే వరకు వారందరినీ బీఆర్ఎస్ మిత్రులుగా మార్చుకోవాలని చూస్తున్నారు. వీరందరితో కేటీఆర్ మాట్లాడేలా ఒక భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కొత్త ఓటర్లను తమ వైపునకు తింపుకోవడంలో సక్సెస్ కావాలని ఇప్పటికే అధినేత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం కప్ కు సంబంధించి ఆయా విభాగాల్లో గెలుపొందిన వారికి కేసీఆర్ బొమ్మ ఉన్న మెమెంటోలను అందించారు.






