
AI Vs Smart Robot : కృత్రిమ మేధ (ఏఐ)ని ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. రాయడం, కోడింగ్, డేటా పనులు వంటి డెస్క్ ఉద్యోగాలను ఏఐ చేస్తోంది. దీని వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఏఐ మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంది.
స్మార్ట్ రోబోల రాక..
చాట్‌జీపీటీ సంస్థ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏఐ గురించి మాట్లాడారు. ఏఐ ఇప్పటివరకు చేసినవి కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పారు. డెస్క్ ఉద్యోగాలు పోతాయని అందరూ ఆందోళన చెందుతున్నా, ఏఐ వల్ల ఇంకా పెద్ద మార్పులు రాబోతున్నాయని అన్నారు.
త్వరలోనే మనుషుల్లాంటి స్మార్ట్ రోబోలు (హ్యూమనాయిడ్ రోబోట్స్) మన రోజువారీ జీవితంలో భాగమవుతాయని, వీధుల్లో కనిపిస్తాయన్నారు. ఈ రోబోలు ఏం చేయగలవో ప్రపంచం ఇంకా పూర్తిగా చూడలేదన్నారు. అయితే వాటి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా లేదని ఆయన హెచ్చరించారు.
సైన్స్ ఫిక్షన్ మూవీల్లో మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా సమీప భవిష్యత్తులో మన జీవితం మారిపోతుందని శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. మనం రోడ్లపై నడుచుకుంటూ వెళ్తుంటే మన వెనకాల రోబోలు కూడా నడవడాన్ని చూస్తుంటామని చెప్పారు. జాబ్స్, టెక్నాలజీ గురించి ప్రజల ఆలోచన తీరు మారిపోతుందని తెలిపారు.