Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి తెలిపారు. అక్టోబరు 8న జరిగే గరుడసేవ కోసం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గరుడసేవను పురస్కరించుకొని అక్టోబరు 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబరు 9న ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలొ ద్విచక్ర వాహనాల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో గ్యాలరీలలోనికి ప్రవేశం, నిష్ర్కమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణ, పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచడం, భక్తుల రవాణా, పార్కింగ్, బారికేడింగ్ తదితర అంశాలపై అదనపు ఈవో చర్చించారు. క్షవారి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, మెరుగైన సమాచారం కోసం వస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.