online frauds : డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్ మోసాల కేసులు కూడా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు 10 శాతం నుండి 210 శాతం వరకు పెరిగాయి. ఇది కాకుండా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI), ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS), ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI) లావాదేవీలలో కూడా పెరుగుదల నమోదైంది. భారతదేశంలో రోజువారీ చెల్లింపులు చేయడానికి యూపీఐని భారీగా వినియోగిస్తున్నారు. భారతదేశంలో ప్రజలు పెద్ద సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా భద్రతాపరమైన సమస్యలు మాత్రం తగ్గడం లేదు. విద్యార్హత లేకపోవడం, ఆన్‌లైన్ చెల్లింపులపై అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మోసాలను సులభంగా నివారించవచ్చు.
పార్శిల్స్ , ప్యాకేజీల పేరుతో దోపిడీలు..
ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు నిత్యం జరుగుతున్నాయి. మొదట ఒకడు ఫోన్ చేసి మీకు ఓ పార్శిల్ వచ్చిందంటాడు. అందులో డ్రగ్స్ ఉన్నాయని మరొకడు ఫోన్ చేస్తాడు. అక్కడే పెద్ద డ్రామా మొదలవుతుంది. ముంబై పోలీసులంటారు.. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అంటారు.. యాంటీ డ్రగ్స్ స్కాడ్ అంటారు. ఇవతల ఫోన్ మాట్లాడుతున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అకౌంట్లలో ఎంత ఉన్నాయో అంతా ట్రాన్స్ ఫర్ చేయించుకుంటారు. ఈ మోసాల్లో ఎక్కువగా డబ్బున్న వాళ్లను కనిపెట్టి టార్గెట్ చేస్తున్నారు. పొరపాటున భయపడినట్లుగా అనిపించారా… వాళ్ల పీఎఫ్ అకౌంట్లు సహా మొత్తం ఖాళీ చేస్తారు. బయట ఎవరికి చెప్పనీయకుండా డిజిటల్ అరెస్టు పేరుతో భయపెడారు. పార్శిల్ అనే కాదు.. మీ అకౌంట్లో మాఫియా డబ్బులు పడ్డాయని.. అదనీ ఇదనీ … ఫోన్ల తో మోసం చేసే వారి సంఖ్య లెక్కలేదు.. మోసపోయేవాళ్ల సంఖ్య కూడా లెక్కే లేదు.
మన సమాచారం సైబర్ నేరగాళ్లకు ఎలా చేరుతుంది ?..
మన ఫోన్ నెంబర్ మనం చెబితే తప్ప వేరే వాళ్లకు తెలియదు. అలాంటిది మన ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు, క్రెడిట్ కార్డు నెంబర్లు ఇలా సమస్త సమాచారం సైబర్ నేరగాళ్ల దగ్గర ఉంటుంది. అందుకే సెలెక్టివ్ గా ఫోన్లు చేస్తుంటారు. అకౌంట్లలో ఎన్ని డబ్బులు ఉన్నాయో లేదో చూసుకుని మరీ కాల్ చేస్తారు. ఎప్పుడైనా వాట్సాప్ లో ఎవరితోనైనా ఏదైనా ప్యాకేజీ అమెజాన్ లేదా మరో డెలివరీ గురించి మాట్లాడిన కాసేపట్లో ఫ్రాడ్ స్టర్ నుంచి కాల్ వస్తుంది. అది మనం ఎదురు చూస్తున్న ప్యాకేజీనేమో అనుకుంటాం. అంత ఫాస్ట్ గా డేటాను సేకరిస్తున్నరు. అసలు ఇదంతా వారికి ఎలా చేరుతుందనేది ఇక్కడి ఎవరికీ అర్థం కాని విషయం. అంటే మన డేటాను కూడా కొందరు అమ్ముకుంటున్నారని అర్థం అవుతుంది.
ఈ కాల్స్ కట్టడి చేయలేమా ?..
ఈ కాల్స్ కట్టడి చేయలేమా ?..
సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తే.. ఫోన్ లిఫ్ట్ చేయవద్దని హెచ్చరించడం కన్నా.. అసలు డేటా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్యలు మరో సారి తలెత్తవు. ప్రతి ఫోన్ నెంబర్ పై నిఘా పెట్టడం కష్టం. కానీ ఇలాంటి వ్యవస్థీకృత నేరాలు చేసే వారిపై వ్యవస్థలకు స్పష్టమైన అవగాహన ఉంటుది. ఇలాంటి వాటిని ఆపడం.. మన వ్యవస్థలకు చిన్న పని. ఎందుకంటే ప్రతి ఒక్క మొబైల్ సిమ్.. కు అధార్ అనుసంధానమై ఉంటుంది. అయినా కట్టడి చేయలేకపోతున్నారంటే.. సైబర్ దోపిడీ దార్లకు గట్టి మద్దతు ఉన్నట్లే. ప్రజలను దోచుకోవడానికి వ్యవస్థలు అనుమతి ఇస్తున్నట్లే. దీన్ని నివారించకపోతే ప్రభుత్వాలు ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే.