AP: ఏపీలో పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారనే ప్రతిపక్ష నేతల ఆరోపణలను వారు నిజం చేసి చూపిస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన వారిని వదిలేసి ఏకంగా టీడీపీ నేతలందరిపై పోలీసులు కేసులు నమోదు చేయడం చూస్తుంటే అందరికీ ఇదే అర్థమవుతున్నది. వైసీపీ నేతలను మాత్రం సేఫ్ గా పంపించారని, కేసులు కూడా నమోదు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు లో ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లర్లపై కురుబలకోట మండలం ముదివీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ ఘటనలో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, ఏ3 గా అమర్నాథ్ రెడ్డి, ఏ4 రాంగోపాల్ రెడ్డిగా పేర్కొన్నారు వారితోపాటు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, తుమ్మలపాటి రమేషశ్, గంట నరహరి, శ్రీరామ్ చిన్నబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు నమోదు చేశారు మరికొందరు నేతల పైన కూడా కేసు నమోదు చేశారు. ఉమాపతి రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.