ఎమ్మెల్సీ కవితను మరోసారి విచారించనుంది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. తాజాగా మరోసారి 91 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది సీబీఐ. నిన్న ఉదయం 11 గంటలకు గచ్చిబౌలిలోని కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు దాదాపు 8 గంటల పాటు కవితను విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన అమిత్ అరోరా స్టేట్ మెంట్ ఆధారంగా కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అయితే దాదాపు 8 గంటల పాటు విచారించిన సీబీఐ మళ్ళీ 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారణ ఎప్పుడు ? ఎక్కడ అనేది మెయిల్ లో తెలియజేస్తామని స్పష్టం చేసారు. లిక్కర్ స్కాం సమయంలో కవిత 10 ఆపిల్ ఐ ఫోన్ లను ధ్వంసం చేసినట్లు ఆరోపిస్తోంది సీబీఐ. దాంతో ఆ 10 ఫోన్ ల వివరాలను అలాగే మార్చిన 2 సిమ్ ల వివరాలను కూడా అందజేయాలని నోటీసులు జారీ చేసింది సీబీఐ.
అయితే రెండోసారి విచారణ చేసిన సమయంలో కూడా కవిత నుండి సరైన సమాచారం లభించకపోతే 41 సీఆర్పీసీ కింద మళ్ళీ నోటీసులు ఇవ్వడం ఖాయమని అంటున్నాయి సీబీఐ వర్గాలు. దాంతో రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. కవిత ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. సీబీఐ అధికారుల విచారణ అనంతరం కవిత నేరుగా ప్రగతి భవన్ కు వెళ్ళింది. తండ్రి కేసీఆర్ తో పలు అంశాలపై చర్చించింది.