- ఏపీలో రాజకీయ నాయకులపై పోటాపోటీ దర్యాప్తులు

CBI VS CID : ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న దశలో వాతావరణం వేడెక్కేలా సీబీఐ, రాష్ర్ట సీఐడీ అడుగులు పడుతున్నాయి. వివేకా కేసు తుది దశకు చేరుకున్న దశలో కీలక నేత అరెస్ట్ ఖాయమని ప్రకటనలు వినిపిస్తున్నాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కు టీడీపీపై విరుచుకుపడుతున్నది. రాష్ర్ట సీఐడీతో టీడీపీ నేతల ఇండ్లపై తరచూ దాడులు చేయిస్తున్నది. ఇప్పటికే చంద్రబాబు నివసిస్తున్న కరకట్ట ఇంటిని అటాచ్ చేసింది. మరోవైపు టీడీపీలో కీలక నేత ఆస్తులపైనా ఈ దాడులు కొనసాగాయి.
వివేకా కేసు ను డైవర్ట్ చేసేందుకే..
వైసీపీ అధినేత, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి అతి దారుణంగా గత ఎన్నికల ముందు చంపబడ్డారు. మొదటగా గుండెపోటని చెప్పగా, ఆ తర్వాత అది హత్యగా తేలింది. టీడీపీ శ్రేణులపై ఈ నేరాన్ని మోపి, వైసీపీ గత ఎన్నికల్లో కొంత లాభ పడింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేసును అంత సీరియస్ గా తీసుకోలేదు. ఒక దశలో నామమాత్రపు దర్యాప్తుతో చేతులు దులుపుకుంది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన వివేకానందరెడ్డి కూతురు సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ హత్య వివేకా బంధువులు చేసిందేనని తేల్చారు. సీబీఐ దర్యాప్తును ముందుకు సాగనీయకుండా వైసీపీ ఎన్నో అడ్డంకులను సృష్టించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
అయినా సునీత పట్టు వదల్లేదు. పదే పదే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ వైసీపీకి చెక్ పెట్టింది. చివరకు కేసు పరిధిని కూడా తెలంగాణ హైకోర్టు కు మార్చింది. ఏపీలో తన అన్న సీఎంగా ఉండగా, ఆయనపై అనుమానంతోనే సునీత ఇలా నిర్ణయం తీసుకుందని భావిస్తారు. ప్రస్తుతం వివేకా కేసు తుది దశకు చేరుకుంది. కీలక నిందితులంతా అరెస్టయ్యారు. దస్తగిరి అప్రూవల్గా మారాడు. ఇక వైసీపీ కే చెందిన సీఎం జగన్ సోదరుడు, ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ త్వరలోనే ఉంటుందని తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన తండ్రి ని అరెస్ట్ చేశారు. అవినాశ్ అరెస్ట్ కనుక జరిగితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ పడుతుంది.
డైవర్షన్ గేమ్ అమలు..
ఈ నేపథ్యంలో నే వైసీపీ డైవర్షన్ గేమ్ మొదలు పెట్టినట్లుగా భావిస్తున్నారు. టీడీపీ నేతలపై సీఐడీతో దాడులు చేయిస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను బయటకు తీసి ప్రైవేట్ ఆస్తులను అటాచ్ చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ కేసులు కోర్టులు నిలబడవని తెలసినా మళ్లీ మళ్లీ ప్రజల్లో ఏదో జరుగుతున్నదని ప్రచారం చేయించడానికే వైసీపీ అడుగులు వేస్తున్నదని అంతా అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబును దెబ్బకొట్టేలా ఈ వేగం మరింత పెంచుతుందని చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంపై కూడా వైసీపీ కొంత నిరుత్సాహంగా ఉందని, ఏడాదిలోగా టీడీపీ నేతలను కంట్రోల్ చేసేలా రాష్ర్ట దర్యాప్తు సంస్థలను వాడుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తున్నది.
మరి ఈ ఆటలో పై చేయి ఎవరిదో వేచి చూడాలి. చంద్రబాబు ఏదైనా మైండ్ గేమ్ మొదలుపెడితే వైసీపీ ఇరకాటంలో పడడం ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటికే పవన్, చంద్రబాబు, బీజేపీల కలయిక అంశం జగన్ కు ఆ పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. రానున్న రోజుల్లో చంద్రబాబును కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతల మాటలు నిజమవుతాయా అనేది వేచి చూడాలి.