Champions Trophy : వచ్చే ఏడాది (2025) మార్చిలో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీ జరగనుంది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేది లేదని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. భారత్ రాకపోవడంతో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఐసీసీ సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఈ మోడల్ లో భారత్ తో జరిగే మ్యాచ్ లు పాకిస్థాన్ లో కాకుండా ఇతర దేశాల్లో నిర్వహిస్తారన్న మాట. హైబ్రిడ్ మోడల్ కు బలం చేకూరేలా పలు క్రీడా ఛానెళ్లలో కథనాలు వస్తు్న్నాయి. పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులను ఐసీసీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దాదాపు 70 మిలియన్ డాలర్ల బడ్జెట్‌కు ఐసీసీ ఆమోదం తెలిపిందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు మరో 4.5 మిలియన్ డాలర్లు కేటాయించినట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ భారత్ ఆడే మ్యాచ్‌లకు సంబంధించి వేదికను మారిస్తే.. అందుకు అదనపు నిధులు వాడుతుందని సమాచారం. ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ లీగ్ స్టేజ్‌లో భారత్-పాక్ ఒకే గ్రూప్‌లో ఉంటాయని.. మార్చి 1న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే బోలెడు కథనాలు వినిపిస్తు్న్నాయి. దీనిపై డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి సమర్పించింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీని ప్రకారం.. భారత్ తో ఆడేందుకు లాహోర్ స్టేడియం కేటాయించినట్లు తెలిసింది.
ఆసియా కప్ టోర్నీలపై స్పష్టత..
వచ్చే సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీనే కాకుండా.. ఆసియా కప్ కూడా జరగనుంది. అందుకు భారత్ వేదికగా నిలుస్తుంది. టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తుందని సమాచారం. మరుసటి ఏడాది (2026)లో పొట్టి కప్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అదే ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ వేదికగా ఆసియా కప్ నిర్వహించనున్నారు. ఇక్కడా భారత్-పాక్ ఒకే గ్రూప్‌లో తలపడనున్నాయి. ఆ తర్వాత సూపర్ 4 స్టేజ్‌లోనూ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరు జట్లూ ఫైనల్‌కు చేరితే ఒకే టోర్నీలో 3 సార్లు యాదాదీల పోరును తిలకించే అవకాశం వస్తుంది.