
No Josh in the cadre : టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే తలంపుతో ఆయన ముందుకెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే తరువాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చంద్రబాబుకు తెలుసు. వైసీపీ ఇక టీడీపీ ని కకావికలం చేయడం ఖాయం అని ఇప్పటికే గుర్తించారు. మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థులు ఇక బలంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు పవన్ రూపంలో గొప్ప ఊరట లభించింది.
పవనే ఎందుకంటే..
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనీయమంటూ పవన్ పదేపదే చెబుతున్నారు. దీంతో పాటు టీడీపీతో జట్టు కట్టేందుకు ఉవ్విలూరుతున్నారు. అవసరమైతే బీజేపీ ని కూడా ఒప్పిస్తానని పవన్ ప్రకటించడం ఇప్పడు చంద్రబాబు హ్యాపీకి కారణమైంది. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం చంద్రబాబుకు అనివార్యం. ఇప్పటికే వయసురీత్యా ఆయనకు ఇది మోయలేని భారం అవుతుంది. ప్రతిపక్ష హోదాలో మరో ఐదేండ్లు పార్టీని నడపాలంటే అసాధ్యమవుతుంది. అయితే ఇదిలా ఉండగా పవన్ అందిస్తున్నా సహకారంతో టీడీపీ అధినేత ఖుషీగా ఉన్నా , క్యాడర్ లో మాత్రం వణుకు మొదలైంది.
తమకు కావాల్సిన సీట్ల విషయంలో వెనక్కి తగ్గబోమని పవన్ పదే పదే అంటుండడం ఇది బలమైన క్యాడర్ ఉన్న టీడీపీ నాయకులకు నిద్ర పట్టనీయడం లేదు. ఏ సీట్లను పవన్ ఆశిస్తాడో.. ఎవరికి సీటు హరి అంటుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పదవి తనకు వద్దని, రాష్ర్టమే ముఖ్యమని పవన్ స్టేట్ మెంట్లు ఇస్తున్నా రెండు పార్టీల్లోనూ పొత్తులపై అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయి. ఈ సీటు అడుగుతారని కొందరు, లేదు ఆ సీటని మరికొందరు లెక్కలేసుకుంటున్నారు.
మరో ఏడాదే మిగిలి ఉండడంతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్న నాయకులు తమ సీటు పోతే ఎలా అని బాధ పడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి తిరుగుతుంటే, వేరొకరికి సీటు అప్పగిస్తే తమ పరిస్థితి ఎంటని అనుచరులతో వాపోతున్నారు. అధినేతలిద్దరూ మాట్లాడుకోవడం బాగానే ఉన్నా సీట్ల అంశమే ఇప్పుడు మంట పుట్టిస్తున్నది. ఏదేమైనా ఎన్నికల నగారా మోగితే గాని ఎవరి సీటు గల్లంతువుతుందో తెలియదు. రెండు పార్టీలు పట్టు పడితే పొత్తుల పై మొదటికే మోసం వచ్చే పరిస్థతి కూడా లేకపోలేదు. ఇది వైసీపీకి వరంగా మారుతుంది. సో.. మరో ఏడాదిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలిసిపోతుంది.






