Chandrababu Case Arguments : ‘స్కిల్ డెవలప్‌మెంట్’ స్కాంలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కేసును ఏపీ హై కోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది. ఉదయం నుంచి భోజన విరామం ముగిసిన తర్వాత కూడా వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరుఫు సుప్రీ సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. కొన్ని కీలక అంశాలను ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఫిర్యాదే అభూత కల్పనగా ఆయన చెప్పారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ పై గతంలో జరిగిన దర్యాప్తుపై కేవలం మెమో మాత్రం వేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్-17ఏ కింద ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎఫ్ఐఆరే చట్ట విరుద్ధంగా ఉంది. గత జడ్జిమెంట్లను అడ్వకెట్ జనరల్ తప్పుగా అన్వయించారు. సెక్షన్-17ఏ పూర్తి వివరాలు తెలిసి కూడా అనుమతులను తీసుకోలేదన్నారు. గతంలో జరిగిన స్టేట్ ఆఫ్ రాజస్థాన్-తేజ్ మల్ చైదరి కేసును ఉదాహరణగా చెప్పారు.
ఇందులో సెక్షన్-17ఏ వర్తిస్తుంది..
నేరం ఎప్పుడు జరిగిందన్నది కాదు. దర్యాప్తు సమయంలో చట్ట బద్ధతను పరిగణలోకి తీసుకోవాలి. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్-17ఏ వర్తిస్తుంది. 2018 తర్వాత రిజిస్ట్రర్ అయిన ప్రతీ ఎఫ్ఐఆర్ కు సెక్షన్-17ఏ వర్తిస్తుంది. ఆ సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇప్పుడు పదవి లేదని సెక్షన్ వర్తించదు అనడం చట్టబద్ధం కాదు. కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వంపై ప్రతీకార చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ నిబంధనను పొందు పరిచారు. కేసులోని ప్రభుత్వ కౌంటర్ కాపీ ఇచ్చారు. ఇందులో కూడా గతంలో చెప్పిన ఆరోపణలే మళ్లీ వివరించారు. అన్నారు సాల్వే.
రాజకీయ ప్రతీకార కేసుగా చూడాలి..
‘చంద్రబాబుపై పెట్టిన కేసు రాజకీయ ప్రతీకార చర్యగానే పరిగణించాలి. న్యాయస్థానం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా విచక్షణాధికారం వినియోగించాలి. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రతీకార పూర్వక కేసుగానే చూడాలి. ఈ కేసులో జీఎస్టీ ఫిర్యాదులను హై కోర్టు పరిశీలించింది. ఈ ప్రాజెక్టులో 90 శాతం వ్యయం ప్రైవేట్, 10 శాతం ప్రభుత్వం భరిస్తుంది.’ దీంతో పాటు మరిన్ని వివరాలను హరీశ్ సాల్వే కోర్టుకు చదివి వినిపించారు.
శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని చెప్పలేదు..
అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ప్రాజెక్ట్ లో నగదు అంశం మాత్రమేు ప్రభుత్వానికి సంబంధించింది. ఇక మిగిలినవన్నీ ప్రైవేట్ సేవలే. స్కిల్ సెంటర్లకు స్థలం, అనుమతి రూ. 330 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్ట్ వ్యయంతో పోలిస్తే ప్రభుత్వం చెల్లించేది చాలా స్వల్పం (కేవలం 10 శాతం). ఇక ఒప్పందం తర్వాత ఎవరు ఏం చేయాలని అంగీకారం కుదుర్చుకొని సంతకాలు చేసుకొని పత్రాలు కూడా మార్చుకున్నారు. ఇదంతా చట్ట బద్ధంగానే జరిగింది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఇది అధికర దుర్వినియోగమే. సదరు అనుబంధ సంస్థనే కేంద్రాలను ఏర్పాటు చేసిందని సిమెన్స్ సైతం స్పష్టం చేసింది. కేంద్రాలు ఏర్పాటు చేయలేదని చెప్పలేకపోయింది.
ఫిర్యాదే అభూత కల్పన..
ఇది కేవలం టాక్స్ పేయర్స్ కు సంబంధించిన ఫిర్యాదు. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవి కూడా నడుస్తున్నాయి. ఒకవేళ ఇన్ వాయిస్ లు పెంచి చూపిస్తున్నారు అనుకుంటే అది అంతర్గత అంశం. ఒక వేళ ఇన్ వాయిస్ పెంచారని అనుకున్నా అప్పటి సీఎం ఎందుకు బాధ్యుడు అవుతాడు. ఇది కేవలం సెన్ వ్యాట్ సమస్యనే.. పన్ను కేసును మార్చి అవినీతి నిరోధక చట్టం కింద ఎలా కేసు నమోదు చేస్తారు. పైగా ఇందులో సెక్షన్-17ఏ వర్తిస్తుంది. కేసు రిజిస్ట్రేషన్ చేసిన వారు అనుమతులు తీసుకోలేదు. కేవలం ఒక మెమో ఆధారంగానే మాజీ ముఖ్యమంత్రిని నిందితుడిగా చేర్చారు. ఈ ఫిర్యాదే అభూత కల్పన. ప్రాజెక్ట్ లో కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు ఏర్పాటు చేశారు. అందులో ఎక్కడా సొమ్ము దుర్వినియోగం అయినట్లు ఆధారం లేదు. సీనియర్ సివిల్ ఆఫీసర్స్ ను ‘హెంచ్ మన్’ అని ఎలా అంటారు? ‘అపాయింటెడ్ హంచ్‌మెన్’ అని ఫిర్యాదులో సంబోధించవచ్చా?
ప్రాజెక్టు విలవ సరైనదేనని కేంద్ర సంస్థలు చెప్తున్నాయి. ఫిర్యాదులో ప్రైవేట్ సంస్థలు లాభాలు దండుకుంటున్నాయని చెప్పారు. అలాంటప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ కేసులో భాగస్వామ్యం చేయాలి కదా? ఈ ప్రాజెక్టులో 10 శాతం మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 90 శాతం ప్రైవేట్ సంస్థలు పెట్టుకోవాలి. కాల క్రమంలో ప్రాజెక్ట్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యింది. అసలు ఈ కేసు ఎందుకు పెట్టారు? అని సాల్వే ప్రశ్నించారు.
17ఏ వర్తించదు: సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గి
సీఐడీ తరుఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్-17ఏ వర్తించదని, ఇది కేవలం ప్రభుత్వ సర్వెంట్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు. కొన్ని అరుదైన కేసుల్లో కోర్టులు జోక్యం చేసుకోవాలని ఇలంటి వాటిలో కాదని వాదించారు. 6 షెల్ కంపెనీలకు డబ్బులు తరలించి విత్ డ్రా చేశారన్నారు.