
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీయే పొత్తు కింద బీజేపీ తరఫున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ఢిల్లీలోని తెలుగువారున్న ప్రాంతాల్లో బీజేపీ మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్‌తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఆదివారం ఎంపీలతో కలిసి చంద్రబాబు అధికారికంగా బీజేపీ తరఫున ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేగంగా కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ తమ తమ అగ్రనాయకులను ప్రచారానికి దింపుతూ ప్రజల మద్దతును సంపాదించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలుండటంతో ప్రచారం మరింత ఉత్కంఠభరితంగా మారింది. అన్ని ప్రధాన పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ తమ పార్టీ విధానాలను ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు తమ మ్యానిఫెస్టోలు ప్రకటిస్తూ, ఎన్నికల ప్రణాళికలను వివరించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.
ఇక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను కూటమి అభ్యర్థులుగా ప్రకటించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 27న జరిగే ఈ ఎన్నికల్లో వారిని భారీ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని నేతలకు సూచించారు.