
Chandrababu sketch : ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అందివచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ, తన రాజకీయ చతురతతో అడుగులు వేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా అధికార వైసీపీని ఓడించాలని ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నందమూరి కుటుంబాన్ని అంతా ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సారి శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఈ నెల 20న హైదరాబాద్లోని కూకట్ పల్లిలో నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. నిర్వహణ కమిటీ బాధ్యతలు చూస్తున్న టీడీ జనార్దన్ నందమూరి కుటుంబ సభ్యులతో సహా పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు. శకపురుషుడు అనే సావనీర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా పలు ఉపన్యాసాలతో జై ఎన్టీఆర్ అనే వెబ్ సైట్ ను ఆవిష్కరిస్తారు.
అయితే ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా గారు, సీపీఎం నేత సీతారాం ఏచూరి, నందమూరి కుటుంబానికి చెందిన దగ్గుబాటి పురందరేశ్వరి, జన సేన చీఫ్ పవన్ కల్యాణ్, కన్నడ హీరో శివకుమార్, తెలుగు హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మురళీ మోహన్, సుమన్, దర్శకుడు రాఘవేంద్రరావు, ఇతర దర్శక నిర్మాతలు, మరికొంత మంది హీరోలు ఒకే వేదికపైకి రానున్నారు.
అయితే మరో ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నిర్వహిస్తున్న ఈ శత జయంత్యుత్సవాలు అన్న ఎన్టీఆర్ ను తెలుగు ప్రజల గుండెల్లో మరోసారి గుర్తు చేసుకునేలా చేస్తున్నాయి. ఇప్పటికే విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో జరిగే కార్యక్రమం ద్వారా టీడీపీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నది. అయితే ఈ కార్యక్రమం ఈసారి టీడీపీకి కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇది కలిసివస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి ఆహ్వానాలు అందిన హీరోలు ఈ కార్యక్రమానికి హాజరవుతారా.. లేదా వేచిచూడాలి.