Chandrababu :
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. ఇక రేపో, మాపో ఎన్నికలు అనేలా ప్రధాన పార్టీలన్నీ ప్రజా క్షేత్రంలోకి వచ్చేశాయి. ఒక్క అధికార పార్టీ మినహా మిగతా అన్ని పార్టీలు ప్రజల్లోనే ఉంటున్నాయి. జనసేన, టీడీపీ పొత్తు ఖాయంగా కనిపిస్తున్నది. ఇక బీజేపీతో జట్టు కట్టేందుకు ఇటు టీడీపీ, అటు వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు ఇక నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ప్రాజెక్టుల బాట పట్టారు. రాయలసీమ యాత్రకు రంగం సిద్ధం చేసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు కనిపిస్తున్నది. జగన్ గడ్డ నుంచే స్కెచ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుల సందర్శన పేరిట మంగళవారం నుంచి పర్యటన మొదలుపెట్టారు. పెన్నా నుంచి మొదలుకొని నాగావళి వరకు వివిధ నదులపై ఉన్న ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వమే టార్గెట్ గా ఈ పర్యటన చేయబోతున్నారు. నంద్యాల జిల్లా నుంచి తన పర్యటన ప్రారంభించనున్నారు. నందికొట్కూర్ లో జరిగే రోడ్ షో, బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. అయితే తన పర్యటనలో భాగంగా పులివెందులపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాలపైనా ఆయన దృష్టి పెట్టారు. జగన్ కుప్పంలో హడావుడి చేయిస్తుండగా, ఇక చంద్రబాబు పులివెందుల నుంచి సమర నినాదం మోగించనున్నారు. ఇప్పటికే వైనాట్ 175 అంటూ వైసీపీ నినాదం మొదలుపెట్టింది. కుప్పంలో కూడా పార్టీ జెండా ఎగరేయాలని తహతహలాడుతున్నది. అక్కడ భరత్ ను అభ్యర్థిగా పెట్టి మంత్రి పెద్దిరెడ్డి రామ
చంద్రారెడ్డి రాజకీయం చేస్తున్నారు. దీనికి దీటుగా చంద్రబాబు రాజకీయం మొదలు పెట్టారు.
వైనాట్ పులివెందుల అంటూ టీడీపీ నినాదం మొదలుపెట్టింది. ఇప్పటికే లోకేశ్ యువగళం నినాదం పులివెందులలో ఆశించనదాని కంటే ఎక్కువ స్థాయిలోనే విజయవంతమైంది. ఇక రానున్న ఎన్నికల్లో జనసేన తో కలిసి నడవాలనుకుంటున్న నేపథ్యంలో ఇక పులివెందులను కూడా చంద్రబాబు టార్గెట్ చేశారు. జగన్ ను దెబ్బకొట్టేలా ఇక్కడ కూడా తన రోడ్ షో, బహిరంగ సభలు ప్లాన్ చేశారు. పులివెందులలో వైఎస్ కుటుంబ ఆగడాలను లక్ష్యంగా చేసుకొని ఆయన స్థానిక ప్రజలతో మమేకం కాబోతున్నారు. ఇప్పటికే ఒక స్పెషల్ టీం టీడీపీ గెలుపు కోసం పులివెందులలో పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. వైఎస్ కుటుంబానికి అక్కడ ఉన్న ఆదరణ నేపథ్యంలో కొంత కష్టమే అయినా ఈసారి జగన్ ను దెబ్బతీయాలంటే పులివెందులకే పరిమితం చేసేలా టీడీపీ స్కెచ్ వేస్తున్నది. మరి చంద్రబాబు టూర్ సక్సెస్ అవుతుందా.. ఆశించిన ఆదరణ దక్కుతుందా.. వైఎస్ కుటుంబానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ఆదరణ మసక బారుతుందా అంటే రానున్న ఎన్నికల్లోనే తేలిపోతుంది.