Chandrababu :
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రక్షాళన మొదలుపెట్టారు. పార్టీ వెనుకబడి ఉన్ని నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పటికే అభ్యర్థులపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్రధాన నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ని బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి రావాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. 2019 తర్వాత పార్టీ కోసం పని చేయని వారిని, ప్రత్యర్థి పార్టీలతో లాలూచి పడిన వారిని గుర్తించి పక్కన పెట్టేస్తున్నారు.
అయితే తాజాగా పార్వతీపూరం నుంచి చంద్రబాబు మొదటి అడుగు వేశారు. ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ చార్జిగా బోనెల విజయ చంద్రను నియమించారు. మొన్నటివరకు మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు ఇక్కడ ఇన్చార్జిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి చిరంజీవులు గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జోగారావు చేతిలో ఓడిపోయారు. చిరంజీవులపై కొంత వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ శ్రేణుల నుంచి చంద్రబాబుకు నివేదిక వెళ్లింది. అయితే విజయ చంద్ర వ్యాపార రంగంలో ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం శ్రమిస్తానని, శ్రేణులతో కలిసి పని చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఈ సారి అధికారమే లక్ష్యంగా చంద్రబాబు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలవకపోతే జరిగే పరిణామాలను వారికి వివరిస్తున్నారు. ఏ ఒక్క నిర్లక్ష్యం తగదని, పనితీరు మేరకే టికెట్లు ఉంటాయని స్పష్టంగా చెబుతున్నారు. ఇందులో జూనియర్లు, సీనియర్లు అంటూ ఏం లేదని అందరికీ వర్తిస్తుందని చెబుతున్నారు. మోహమాటానికి పోతే పార్టీకి ఇబ్బందికరపరిస్థితులు వస్తాయని ఈ నేపథ్యంలో వేటు తప్పదని స్పష్టం చేస్తు్న్నారు. ఈ దిశగా పార్వతీపురం నుంచి మొదటి వేటు మొదలుపెట్టారు. ఇక మరికొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల మార్పు ఉండబోతున్నదని తెలుస్తున్నది. త్వరలోనే వారి పేర్లను కూడా అధినేత చంద్రబాబు ప్రకటిస్తారని శ్రేణులు చెబుతున్నాయి.