Chandrayaan 3 Engineers :
ప్రతి భారతీయుడు గర్వించేలా ఇస్రో చంద్రయాన్ 3 ని ప్రయోగించింది. ప్రస్తుతం మూడో దశను పూర్తి చేసుకొని విజయవంతంగా కక్ష్యలో వెళ్తున్నది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయితే ఇక మువ్వన్నెల రెపరెపలు చంద్రుడిపై కూడా ఉండబోతున్నాయి. అమెరికా, సోవియేట్ యూనియన్, చైనా తర్వాత నాలుగో దేశంగా మనమే ఈ ఘనత సాధించినట్లయ్యింది.
ప్రపంచమంతా నెవ్వెరపోయేలా సాగిన ఈ చంద్రయాన్ 3 ప్రస్థానంలో ఎందరో సైంటిస్టులు, ఇంజినీర్లు ఇందులో పాలుపంచుకున్నారు. ఇక వారి ఆనందానికి అవధుల్లేవ్. అయితే ఈ ఆనందం వెనుక వారి కష్టం దాగి ఉంది. వారి కన్నీటి చుక్కలు దాగి ఉన్నాయి. ప్రయోగం సక్సెస్ కావడం వెనుక వారి కుటుంబాల త్యాగం దాగి ఉంది. అహోరాత్రులు కంటి మీద కునుకు లేకుండా శ్రమించిన ఆ ఇంజినీర్లకు సలాం కొట్టాల్సిందే.
ఇంత గొప్ప విజయం వెనుక లాంచ్ ప్యాడ్ తో పాటు మిగతా పనులు చేసిన ఇంజినీర్లకు 17 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. అయినా కూడా వారు వెనక్కి తగ్గలేదు. డిసెంబర్ నాటికి లాంచ్ ప్యాడ్ ను సిద్ధం చేసినందువల్లే ఇప్పుడు సమయానికి ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం చేయగలిగింది. అయితే ఈ లాంచ్ ప్యాడ్ ను హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్.
ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది రాంచీలో ఉంది. ఈ కంపెనీలో సుమారు 600 మందికి పైగా ఉన్నారు. వీరికి 17 నెలలుగా జీతాల్లేవు. ఇదే వార్త అనేక పత్రికల్లో గతంలో ప్రచురితమైంది. జీతాలు రాకపోయినా దేశ ప్రగతిలో ఆ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ కంపెనీకి సుమారు రూ. 1500 కోట్ల ఆర్డర్లు దేశంలోని వివిధ కేంద్ర శాఖల నుంచి ఉన్నాయి. అయితే తమకు రూ. వెయ్యికోట్లు సమకూర్చాలని కేంద్ర పరిశ్రమల శాఖను కోరుతున్నది.
మూడేళ్లుగా ఇదే పరిస్థితి. అయినా కేంద్రం స్పందించడం లేదు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను చంపేసి, ప్రైవేట్ కు అప్పగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. రాఫెల్ విషయంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇదే పంథాను కొనసాగించింది. యుద్ధ విమానాలు తయారు చేసే హెచ్ఈఎల్ ను కూడా తొక్కే ప్రయత్నం చేసింది.
దానిపై అసమర్థ కంపెనీ ముద్ర వేసి, ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ అప్పగించడమే ఇందులో ఉద్దేశం. కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా ఇక బాధ్యతాయుత ప్రభుత్వరంగ సంస్థలను మూసేయడం పనిగా పెట్టుకుంది.
దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇలాంటి కంపెనీలను మూసేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రయాన్ 3 లాంచ్ పాడ్ తయారు చేసిన ఉద్యోగులకే జీతాల్లేవు అంటే పరిస్థితి అర్థమవుతున్నది.
కేంద్రం తీరుతో ఇలాంటి సంస్థల ఉద్యోగులెందరో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి దేశ భవిష్యత్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఉద్యోగులకు కూడా ఇలాంటి కష్టాలు రావడం నిజంగా పాలకుల తీరువల్లే అని అర్థమవుతున్నది.
కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలకడంలో భాగంగా ఇలా ప్రభుత్వ రంగ సంస్థల ఉసురు తీయడం అన్యాయం అని అంతా మండిపడుతున్నారు. 17 నెలలుగా వేతనాల్లేకున్నా, తమ కష్టంతో చంద్రయాన్ 3ని ప్రపంచానికి అందించిన ఆ యోధుల శ్రమను పట్టించుకోవాలని అంతా కోరుతున్నారు.