విధి విచిత్రమైనది. ఎన్నో దారుణాలకు వేదికగా నిలుస్తుంది. సంతోషాలకు వారధిగా మారుతుంది. కష్టమొస్తే విధిని నిందిస్తారు. సంతోషమొస్తే మాత్రం దాన్ని వదిలేస్తారు. దక్షిణ అమెరికాలోని కొలంబియా అడవుల్లో 40 రోజులు చిన్నారులు ప్రాణాలతో గడపడం నిజంగా సాహసమే. ఓ విమాన ప్రమాదంలో వారు మృత్యుంజయులుగా మారి అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో ఓ 11 నెలల చిన్నారి కూడా ఉండటం విశేషం.
అమెజాన్ అటవీ ప్రాంతంలో అరారాక్యూరా నుంచి శాన్ జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే 1న ఓ విమానం బయలుదేరింది. అందులో నలుగురు చిన్నారులు, వారి తల్లి, గైడ్, పైలెట్ ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్య ఏర్పడటంతో అది కూలుతున్నట్లు పైలెట్ ప్రకటించాడు. తరువాత దాంతో సంబంధాలు కట్ అయిపోయాయి.
ప్రమాదం గురించి తెలుసుకున్న సైన్యం రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. వారి కోసం అడవి అంతా గాలించారు. ఆపరేషన్ హోప్ పేరిట సహాయక చర్యలు చేపట్టారు. రెండు వారాల తరువాత మే 16న విమాన శకలాలను గుర్తించారు. పైలెట్, చిన్నారుల తల్లి, గైడ్ మృతదేహాలు లభ్యం అయ్యాయి. పిల్లల ఆచూకీ మాత్రం చిక్కలేదు.
విమానంలో 13,9,4 ఏళ్ల చిన్నారులు ఓ 11 నెలల పసికందు సైతం ఉన్నట్లు గుర్తించారు. కానీ వారు ఎక్కడ ఉన్నారనే విషయం మాత్రం అంతుచిక్కలేదు. దీంతో జాగిలాలతో అడవినంతా జల్లెడ పట్టారు. 150 మంది సైనికులు శ్రమించి మే 18న పిల్లలు క్షేమంగా ఉన్నట్లు కనుగొన్నారు. వారు ధరించిన వస్తువులు వారి కంట పడటంతో వారు ప్రాణాలతోనే ఉన్నట్లు తెలుసుకున్నారు.
40 రోజుల తరువాత గాలింపు బృందాలు వారి వద్దకు చేరుకుని వారిని సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఈ ఆపరేషన్ లో సైనికులు విస్తృతంగా శ్రమించారు. చిన్నారుల ఆచూకీ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఎట్టకేలకు భద్రతా సిబ్బంది వారిని పట్టుకోవడంతో కథ సుఖాంతమైంది.






