Chiranjeevi Gang Leader Movie : గ్యాంగ్ లీడర్ ..చిరంజీవి కెరీర్ లోనే నంబర్ వన్ సినిమా ఇది. ఈ సినిమా 200 రోజులకు పైగా ఆడిన సినిమా. ఈ సినిమా చూద్దామంటే నెల రోజుల దాక టికెట్లు దొరకలేదంటే అతిశయోక్తి కాదు. సీ సెంటర్లలో సంవత్సరం తర్వాత ప్రదర్శించినా నెల రోజుల పాటు ఆడింది. ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే..
దేశంలోనే ఒకే రోజు నాలుగు పట్టణాల్లో శతదినోత్సవ వేడుకలను జరిపారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా శతదినోత్సవాల్లో ప్రత్యేక విమానంలో ఈ నాలుగు పట్టణాలు(హైదరాబాద్, తిరుపతి, మరో రెండు ఇతర నగరాలు) తిరిగి లక్షలాది అభిమానుల మధ్య జరుపడం విశేషం. కోస్తాలోని పట్టణంలో జరిగిన శతదినోత్సవ వేడుకలను రాజేంద్రప్రసాద్ ‘అప్పుల అప్పారావు’ సినిమాలో అన్నపూర్ణ ఎపిసోడ్ లో కనపడడం మీరు చూసే ఉంటారు.
ఇలాంటి ఘనతలు ఎన్నో ఉన్నా.. గ్యాంగ్ లీడర్ కథ చిరంజీవి మొదట్లో ఎందుకు నచ్చలేదు..అసలేం జరిగిందో చూద్దాం.. ఈ సినిమా దర్శకుడు విజయబాపినీడు. ఈయన చిరుతో అంతకుముందు పట్నం వచ్చిన ప్రతివ్రతలు, హీరో, మగధీరుడు వంటి సినిమాలు తీశారు. గ్యాంగ్ లీడర్ కథతో ఓసారి చిరంజీవిని కలిశారు. అద్భుతమైన కథతో చిరంజీవికి మరో భారీ హిట్ ఇద్దామన్న ఆశతో ఆయన కలిస్తే.. చిరు కథ విన్న తర్వాత ఎలాంటి మొహమాటం లేకుండా ఈ సినిమా ఆడదు.. నేను చెయ్యను అంటూ నో చెప్పాడట. దీంతో తీవ్ర నిరాశకు లోనైన బాపినీడు వెంటనే పరుచూరి బ్రదర్స్ ను కలిశారు. ఆ కథను వారికి వినిపిస్తే.. వారు అందులోని కొన్ని లోపాలను సరిదిద్దారట.
ఇక ఆ కథతో చిరంజీవి వద్దకు వెళ్తే పరుచూరి బ్రదర్స్ పై ఉన్న నమ్మకంతో కథను ఓకే చేశాడు. అలాగే ఈ సినిమా డేట్స్ అరెంజ్ చేయమని అల్లు అరవింద్ కు చెప్పాడట. ఇక అల్లు అరవింద్ మరోసారి పరుచూరి బ్రదర్స్ దగ్గరకు వెళ్లి ఈ కథను రికార్డు చేసుకుని మరి విన్నాడట. అలా మొదలైన గ్యాంగ్ లీడర్ కథ తెలుగు ఇండస్ట్రీ టాప్ -10 లో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా పాటలు, కామెడీ, ఫైట్స్, స్టోరీ..ఇలా ప్రతీ సీన్ హైలెటే. ప్రతీ పాట, ప్రతీ స్టెప్ అదుర్సే..బప్పిలహరి అందించిన మ్యూజిక్ ఇప్పటి డీజేల్లో వేస్తే నా సామిరంగ మాములుగా ఉండదు. అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ సినిమాను హిందీలో కూడా చిరంజీవి హీరోగా ‘అజ్ కా గుండారాజ్’ పేరుతో నిర్మించారు. అక్కడ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడమే కాదు బెస్ట్ మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది.