CI Anju Yadav :
శ్రీకాళహస్తీ సీఐ అంజూయాదవ్ ఇప్పుడు తెలుగు మీడియాలో హాట్ టాపిక్.. సంచలనాలకు ఆమె కేంద్ర బిందువయ్యారు. ఆమె తీరు ఆది నుంచి వివాదస్పదమే. సీఐపై చర్యలు తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం ఆమెను ప్రోత్సహిస్తున్నదని అపవాదు మూటగట్టుకుంటున్నది. ఐదురోజుల క్రితం జనసేన నేతపై చేయిచేసుకొని ఆమె జనసేన శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. తనపై ఫిర్యాదు చేసిన హోటల్ యజమాని ముందు ఫోన్ చూస్తూ, తొడగొడుతూ వికట్టహాసం చేస్తున్న వీడియో ఇప్పుడు ఆమె శైలిని తెలియజేస్తు్న్నది.
గతంలోనూ టీడీపీ, జనసేన నేతలపై సీఐ అంజూయాదవ్ ఇలాగే వ్యవహరించారు. ఒక హోటల్ నిర్వాహకురాలిపై గతంలో ఆమె వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది. చీర ఊడిపోతున్నా, ఆమె వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఆమె వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. మహిళా సంఘాలు కూడా సీఐ అంజూయాదవ్ పై అగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ నేతల వ్యవహరంలో దురుసుగా ప్రవర్తించి, అంజూ యాదవ్ విమర్శల పాలయ్యారు. తాజాగా జనసేన నాయకుడి చెంప పై రెండు చేతులతో కొట్టి మరోసారి వార్తలో నిలిచారు. ప్రస్తుతం ఆమె ఒక వీడియోలో గట్టిగా వెకిలి నవ్వులు నవ్వుతూ తొడ కొడుతున్న వీడియో ఒకటి చర్చనీయాంశంగా మారింది. సీఐ స్థాయి అధికారిణి ఇలా బాధితులను బండ బూతులు తిడుతూ బెదిరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. హెచ్చార్సీ గతంలో కూడా ఆమెపై సీరియస్ అయ్యింది. శ్రీకాళహస్తీ ప్రజలు కూడా ఆమెపై ఆగ్రహంగా ఉన్నారు.
అయితే సీఐ అంజూ యాదవ్ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఆయన నేరుగా రంగంలోకి దిగారు. సోమవారం తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు ఆయన తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన భారీ ర్యాలీతో ఎస్పీ ఆఫీస్ కు బయల్దేరారు. తమనేత పై దాడి చేసి ఐదు రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు సదరు సీఐ పై పోలీస్ శాఖ చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. పవన్ రాక నేపథ్యంలో పోలీసులు ఎస్పీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన అభిమానులు ఇఫ్పటికే అక్కడికి పోటెత్తారు. ప్రస్తుతం తిరుపతిలో టెన్షన్ వాతావారణం నెలకొని ఉంది. వేలాది మంది అభిమానులతో కలిసి పవన్ తిరుపతి ఎస్పీ ఆఫీస్ కు బయల్దేరారు. మరోవైపు సీఐ వ్యవహారంపై ప్రైవేట్ కేసు వేసేందుకు జనసేన సిద్ధమవుతున్నట్లు సమాచారం.