CI Swarna Lata :నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్ సీఐ స్వర్ణలత అరెస్టు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమెలో మరోకోణం వెలుగులోకి వచ్చింది. వెండితెరపై రాణించాలనే మక్కువ ఆమెలో ఉన్నది. సినిమాలపై ఉన్న ఆసక్తితో స్వర్ణలత కొంతకాలం క్రితం ఓ పాటకు డ్యాన్స్ కూడా చేసింది. ఆ వీడియోతో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశారు. తాను తీయబోయే సినిమాలో ఓ మంచి పాత్ర ఇస్తానని, డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండాలని ఓ ప్రజాప్రతినిధి చెప్పడంతో ఓ డ్యాన్స్ మాస్టర్ ను కూడా నియమించుకుని సాధన చేస్తున్నారు స్వర్ణలత. సినిమా ట్రయల్స్ లో భాగంగా పలు వీడియోలు చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆమె అరెస్టవడంతో యూట్యూబ్‌లో ఈ వీడియోలు వైరల్‌గా అవుతున్నాయి.
ఏపీ 31’.. విశాఖకు చెందిన ఓ మహిళా రిజర్వు ఇన్‌స్పెక్టర్ నటిస్తున్న చిత్రం. దీంతో ఆమెకు సినిమాలంటే ఎంత పాషనో అర్థం చేసుకోవచ్చు.
నృత్యాలతో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్
సినిమాల కోసం ప్రయత్నాలు
సినిమాల్లో అవకాశాలకు ప్రయత్నిస్తుండగా స్వర్ణలతకు వైసీపీ నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. గత జీవీఎంసీ ఎన్నికల్లో ఆమెకు బంధువైన ఓ మహిళా అభ్యర్థి తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్నాళ్ల క్రితం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఏపీ పోలీసు అధికారుల సంఘ ఉపాధ్యక్షురాలి హోదాలో పంచ్ డైలాగ్స్‌తో విరుచుకుపడిన విషయం తెలిసిందే. పోలీసులకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడుతున్నారంటూ అయ్యన్నపై ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అయితే ఇదంతా వైసీప నేతల ప్రోద్భలంతోనే జరిగిందని ప్రచారంలో ఉంది. తాజాగా నోట్ల మార్పిడి కేసులో అరెస్టు కావడంతో.. స్వర్ణలతపై కేసు పెట్టకుండా ఆమెకు సన్నిహితుడైన ఓ కీలక ప్రజాప్రతినిధి తన పలుబడిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. పార్టీ పెద్దలను ఆశ్రయించి ఆమెపై కేసు తీవ్రతను తగ్గించేలా ఒత్తిళ్లు తెచ్చాడంటే స్వర్ణలత పొలిటికల్ రిలేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
సినిమాల కోసమేనా?
ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఏపీ 31’ చిత్ర నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలోనూ స్వర్ణలత భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. అందుకు డబ్బుల కోసమే నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కొందరు రియల్టర్లతోనూ ఆమెకు పరిచయాలున్నాయి. కమీషన్ తీసుకుని.. ఇలా నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కొన్ని ప్లాట్లు కూడా ఆమె బుక్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.






