YCP :
వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు అన్నీ తామై పనులు చేస్తుండగా మరికొందరు నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. తామంతా కష్టపడి గెలిపిస్తే ఎమ్మెల్యేలే సంపాదనకు ఎగబడ్డారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈసారి వారికి టికెట్ రానివ్వమని తేల్చి చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండడం వైసీపీ అధిష్టానాన్ని కలవరపరుస్తున్నది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నూ ఈ పరిస్థితి ఉంది. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేశ్, చిల్లబోయిన వేణు లాంటి నేతలకు కూడా వర్గ పోరు తప్పడం లేదు. ఇక ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లో 60 స్థానాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే నియోజకవర్గ అభ్యర్థి ఖరారైన ప్రాంతాల్లోనూ వైసీపీలో పంచాయతీలు కొనసాగుతున్నాయి. అయితే పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిలను జగన్ మార్చేశారు. ఆయా చోట్ల అసమ్మతి రాగం నేపథ్యంలోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
అయితే ఇలాంటి విషయాల్లో కటువుగా వ్యవహరించే జగన్ రెడ్డి , ఈసారి మెతక వైఖరి అవలంబిస్తున్నారు. నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యమిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే చాలామంది ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా తమకు మేలు జరగలేదని జగన్ ముందే కుండబద్దలు చేసినట్లు చెబుతున్నారు. టికెట్ ఇస్తే ఉంటాం లేదంటే మా దారి మేము చూసుకుంటామంటూ జగన్ కు నేరుగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తులు బయటికి వస్తుండడంతో జగన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. అయితే జగన్ కూడా ఇది మరింత ముదరకముందే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. అండగా ఉంటానని, తనను నమ్మాలని భరోసానిస్తున్నారు. భవిష్యత్ మనదే అంటూ ఆయా నియోజకవర్గాల నేతలకు చెబుతున్నారు.