Alpha Hotel : సికింద్రాబాద్ లోని అల్ఫా హోటల్ ను జీహెచ్ ఎంసీ అధికారులు మూసివేశారు. పరిశుభ్రత పాటించకపోవడం, నాణ్యత లేని ఆహార పదార్థాలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నారనే కారణంతో ఇలా సీజ్ చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అత్యంత రద్ద ప్రదేశంలో ఉండే హోటల్ కావడంతో వినియోగదారులు ఎక్కువ మంది వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కస్టమర్లతో బిజీగా ఉండటంతో హోటల్ మూతపడటంతో ప్రజలకు ఎటు వెళ్లాలో తెలియడం లేదు.
నగరంలో మంచి వంటకాలు లభించే హోటల్ గా గుర్తింపు పొందినా అపరిశుభ్రత, నాణ్యత లేని ఆహారం లాంటి కారణాలే అది మూతపడటానికి దోహదపడటం విడ్డూరం. హోటల్ యజమానిపై జరిమానా విధించేందుకు అధికారులు రెడీ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యమే హోటల్ మూతపడేలా చేసింది. జీహెచ్ ఎంసీ అధికారుల్లో తప్పులు బయటపడటంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
హోటల్ లో సేకరించిన నమూనాలను నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీకి పంపించారు. అధికారులు మరోసారి హోటల్ ను తనిఖీ చేశారు. యాజమాన్యం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడంతో హెచ్చరించారు. అదనపు కలెక్టర్ సహకారంతో యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం తప్పదని చెబుతున్నారు. ఇక హోటల్ పునరుద్దరణ కష్టమేనని అంటున్నారు.
కల్తీ పదార్థాల వినియోగం పెరిగిపోతోంది. దీంతో ఆహార పదార్థాల కల్తీ ఓ వ్యాపారంలా మారుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా కల్తీ చేస్తూ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాన్ని అగాధంలో పడేస్తున్నారు. కల్తీ పదార్థాల కేటుగాళ్లు ఇలా సొమ్ము చేసుకోవడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు.
పాలు, పండ్లు, కూరగాయలు, వంట నూనెలు, తేనె ఇలా ఒకటేమిటి పలు పదార్థాలు కల్తీగా మారుస్తున్నారు. ఇవే తినడం వల్ల అనారోగ్యాలు దరిచేరుతున్నాయి. అందుకే అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కానీ యాజమాన్యాలు మాత్రం తగు చర్యలు తీసుకోవడం లేదు. దీంతోనే అల్ఫా హోటల్ ను మూసివేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా వినియోగదారుల ఆరోగ్యం కోసం తగు చర్యలు తీసుకోకపోతే అంతే సంగతి అని తెలుసుకోవాలి.