
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న సంచలనంగానే ఉంటుంది. ఆయన ఏ పథకం మొదలుపెట్టినా గట్టిగనే మొదలెడుతడు. అంటే ప్రజలకు వందల్లో… వేలల్లో కాదు లక్షల్లోనే లబ్ధి చేకూరేలా చూస్తడు. ఇలా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో ఆయన కంటే మించిన రాజకీయ నాయకుడు లేడంటే అతిశయోక్తి కాదు. హుజూరాబాద్ ఎలక్షన్ల సమయంలో దళిత బంధు పథకం తెచ్చి సంచలనం సృష్టించాడు. ఏకంగా కుటుంబానికి రూ. 10 లక్షలతో ఈ పథకాన్ని అమలు చేశాడు. అయినా ఆ నియోజకవర్గంలో చేదు ఫలితమే ఎదురైంది. ఆ తర్వాత నియోజకవర్గానికి 100 చొప్పున అంటూ దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టాడు. ఏదేమైనా ఈ పథకం ద్వారా కొంత దళితుల చూపును తనవైపు తిప్పుకున్నాడు.
అయితే తాజాగా సీఎం కేసీఆర్ మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ పథకం ద్వారా లబ్ధిదారుకు రూ. లక్ష, ఇండ్లు నిర్మించుకునే పేదలకు రూ. 3లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈ పథకానికి ఈ ఏడాది 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రకటించారు. దళితబంధు తరహాలోనే బీసీ బంధును సీఎం కేసీఆర్ తెరపైకి తెచ్చారు. పథకం అమలు అంశం అలా ఉంచితే ఎన్నికల వేళ ఇప్పుడిదో కొత్త స్ర్టాటజీలా మారింది. తెలంగాణలో ఎన్నికలకు మరో ఐదు నెలల గడువు మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమై, క్షేత్రస్థాయిలో స్క్రూటినీ అయ్యి పూర్తి ఎంపిక ప్రక్రియ అయ్యేవరకు కొంత సమయం పడుతుంది. అంటే ప్రస్తుతానికి కొంతమందికి మాత్రం అందుతుందన్నమాట. ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ సగంలో ఉన్నవారు తమకు కూడా లబ్ధి చేకూరుతుందనే ఆశతో మళ్లీ బీఆర్ఎస్ కే పట్టం కడుతారు.
ఎన్నికల ఏడాదిలో ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఎక్కువ మంది తప్పుపడుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు ప్రభుత్వంపై కొంత గుర్రుగానే ఉన్నారు. చాలా కాలానికి ఇచ్చిన నోటిఫికేషన్లు ప్రశ్నాపత్రాల లీక్ ల కారణంగా అభాసుపాలయ్యాయి. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అయినా అనుమానపు నీడలు పోలేదు. ఇప్పుడు పథకాల పేరుతో ప్రభుత్వం ఎన్నికల గేమ్ మొదలుపెట్టింది. దీనిని స్వాగతించే పరిస్థితి ఒక్క బీఆర్ఎస్ శ్రేణుల్లో మినహా మరెవరిలోనూ నమ్మకం లేదు. అతి తక్కువ సమయం ఉండగా ఇలాంటి పథకాలు ఓట్లు రాబట్టుకోవడానికేనని అంతా అర్థం చేసుకుంటున్నారు.
మరి బీఆర్ఎస్ అధినేతకు ఇదంతా తెలవనిది కాదు. అయినా ఆయన మనసులో ఏముందో.. ఎన్నో లెక్కలు.. ఎన్నో చర్చలు ఉంటేనే కాని కేసీఆర్ ఒక పనిచేయడు. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి మరి. మరి ఇప్పుడీ పథకాలు బీఆర్ఎస్ కు ఎంతమేరకు లాభం చేస్తాయో త్వరలోనే తేలనుంది.