Telangana : ఎన్నికలు పూర్తై పది నెలలు కావొస్తుంది. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ కు రోజుకో ఎమ్మెల్యే షాకిస్తున్నారు. ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలవగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 64 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 74 కు చేరింది. మిత్రపక్షమైన సీపీఐని కూడా కలుపుకుంటే అది 75 అవుతుంది. ఇక బీఆర్ఎస్ కు 29, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గులాబీ బాస్ కేసీఆర్ మాటలను సైతం లెక్క చేయడం లేదని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుందని ఒకపక్క కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాంగ్రెస్‌కు బ్రహ్మాస్త్రం దొరికిందా? అనర్హత వేటు నుంచి ఎమ్మెల్యేను రక్షించుకునే ప్లాన్ రెడీ చేస్తోందా? జంపింగ్ ఎమ్మెల్యేల రక్షణకు కాంగ్రెస్ అమలు చేయనున్న ప్లాన్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా, వారిలో ముగ్గురిపై అనర్హత కత్తి వేలాడుతోంది. మిగిలిన ఏడుగురిపైనా చర్యలకు బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరిన మొత్తం పది మంది ఎమ్మెల్యేల రక్షణకు ప్రభుత్వ పెద్దలు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ ఎల్పీ విలీనమే అజెండాగా ఇన్నాళ్లు పావులు కదిపిన కాంగ్రెస్.. తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే ఆ పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు బయటకు రావాలి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు అధికారికంగా 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇందులో 10 మంది కాంగ్రెస్‌తో జత కట్టారు. ఇక మిగిలిన 28 మందిలో 16 మందిని కలుపుకోవాలని చాలా ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్… ప్రస్తుతానికి చేతులెత్తేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఆశించినట్లు బీఆర్‌ఎస్ నుంచి చేరేందుకు మిగిలిన ఎమ్మెల్యేలు ఆసక్తి చూపకపోవడం.. ఈ లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆయన పై ఒత్తిడి పెంచేందుకు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పునివ్వడంతో ప్రభుత్వం ప్లాన్ బీ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హైకోర్టు సూచనలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా వేటు వేయాల్సి ఉంటుందని ఆందోళన చెందిన కాంగ్రెస్.. తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మస్త్రాన్ని బయటకు తీసినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ నుంచి నాలుగో వంతు సభ్యులు బయటకు వచ్చి తమను సెపరేట్ గ్రూప్‌గా గుర్తించాలని కోరితే అనర్హత వేటు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు త్వరలో స్పీకర్‌ను కలిసి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన కాంగ్రెస్ ప్లాన్ తాజాగా లీకైంది. ఈ వ్యూహం ప్రకారమే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్‌గా నియమించారంటున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేకు పీఏసీ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నిలదీయడం… దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తూ వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేయడంతో కాంగ్రెస్ అసలు ప్లాన్ బయటపడిందని అంటున్నారు. అయితే దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు నేడో.. రేపో ఈ వ్యూహాన్ని అమలు చేయొచ్చని టాక్ నడుస్తోంది.