telangana politics ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ తెలంగాణ పాలిటిక్స్ లో గందరగోళం ఏర్పడుతుంది. ఏ నాయకుడు ఏ పార్టీలోకి వెళ్తాడన్న అనుమానాలతో కేడర్ సతమతం అవుతుంది. దీనికి తోడు నాయకులు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒకసారి సిట్టింగులకే టికెట్ అని.. మరోసారి గెలుపు గుర్రాలకే.. అంటూ చెప్పడంతో చాలా కాలం నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కానీ ఇటీవల ప్రజల మద్దతు ఉన్న వారికే టికెట్ ఇస్తామని మరోసారి చెప్పడంతో నాయకులతో పాటు కేడర్ కూడా గందరగోళానికి గురవుతుంది.
ఎన్నికలకు నెలల వ్యవధి మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు వేగం పెంచుతున్నాయి. ఇన్ని రోజులు ఆషాఢం కావడంతో నాయకులు చేరేందుకు ముహూర్తం లేక ఆలోచిస్తున్నారని.. ఇక వలసలు కొనసాగుతాయని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కాచుకోని చూస్తున్నాయి. కర్ణాటక గెలుపు తర్వాత ఊపుమీదికి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరితే గెలుపు ఖాయం అనుకుంటున్న నేతలకు హై కమాండ్ అనే గుబులు పట్టుకుంటుంది. ఏ నిర్ణయమైనా హై కమాండ్ చేతిలో ఉంటుంది. అంటే ఏ నాయకుడు పార్టీలో చేరాలన్నా ఢిల్లీ పర్మిషన్ కావాల్సిందే. దీంతో బడా నాయకులు సైతం వేచి చూస్తున్నారు.
ఇక బీజేపీలో ఇటీవల చాలా మార్పులను తీసుకువచ్చింది. అధ్యక్షుడిని మార్చడంతో పాటు ఈటల వంటి నేతలకు కీలక పదవులను కట్టబెట్టింది. ఈ పార్టీ కూడా బడా నాయకులు తమ పార్టీలోకి వస్తారని ఆశగా ఎదురుచుస్తోంది. ఆషాఢం కావడంతో కొంత మంది నేతలు చేరేందుకు ముందుకు రావడం లేదని ఇక శ్రావణం ప్రారంభమైతే వేగంగా వలసలు ఉంటాయని ఇప్పటికే ఈటల రాజేందర్ ప్రకటించారు కూడా. ఈ పార్టీలో ఎవరు చేరినా కార్యకర్తలు, చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నవారిపైనే డిసిషన్ ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో బీజేపీ గెలుపు కష్టమైనా ఏ పరిస్థితిలో ఏమవుతుందోనన్న ఆలోచనలో కొందరు బీఆర్ఎస్ అసంతృప్త నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు.
బీఆర్ఎస్ కూడా తమ సమీకరణాలను వేగంగా మార్చుకుంటూ పోతోంది. గతంలో చెప్పిన మాటలను మార్చుకుంటూ పోతోంది. సిట్టింగులకని, ప్రజల మద్దతు దారులకనీ.. ఇప్పుడు ఫైనల్ గా గెలుపు గుర్రాలకంటూ చెప్తోంది. చాలా కాలం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు కొంత నిరాసక్తతతో ఉన్నా వారికి నామినేటెడ్ పోస్ట్ లు ఇస్తామని హామీలు ఇస్తూ పార్టీ మారకుండా చూసుకుంటున్నారు. గతంలో వలస వచ్చిన వారితో పాటు ఇప్పుడున్న నాయకులు కూడా కేసీఆర్ మాటలను నమ్ముతున్నారు. కాంగ్రెస్ లో అయితే ఢిల్లీలోని అధిష్టానం కనికరించాలి.. బీజేపీలో కేడర్ కనికరించాలి. కానీ ఇదంతా పని లేకుండా కేసీఆర్ దయ ఉంటే చాలు అని అనుకుంటున్నట్లు గా ఉన్నవారు పార్టీ మారడం లేదు. కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా కొందరు గులాబీలోకి దూకేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.