congress : తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తున్నది. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీలో జోష్ మరింత పెరిగింది. అయితే బీఆర్ఎస్ కు దీటుగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే కనిపిస్తున్నది. ఆ పార్టీ అధిష్టానం కూడా ఈసారి పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి పెట్టింది. అగ్రనేతలు వరుసగా హైదరాబాద్ కు వచ్చి వెళ్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరాలని అధిష్టానం సూచనలు చేస్తున్నది. ఏఐసీసీ నేత, ఇన్చార్జి కేసీ వేణుగో పాల్ ఇటీవల హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పార్టీలో సమన్వయం, లోపాలపై ఆరా తీశారు. ఈ సందర్భంలోనే పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పార్టీ పరిస్థితిపై చేసిన సర్వేను వెల్లడించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో పార్టీ 41 చోట్ల గెలుస్తుందని, మరో 42 చోట్ల కొద్దిగా కష్టపడితే విజయ ఢంకా మోగించడం ఖాయమని చెప్పినట్లు సమాచారం. ఇక మిగతా చోట్ల పార్టీ పరిస్థితి బలహీనంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఆ నియోజకవర్గాల జాబితాను కూడా ఆయన అగ్రనేతలకు అందించినట్లు సమాచారం. దీనిపై పార్టీ రాష్ట్ర ఇన్చార్జి, టీపీసీసీ చీఫ్, మరికొందరు సీనియర్ నేతలు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే పార్టీ బీఆర్ఎస్ ను ఢీకొట్టబోతున్నదని ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, దీనిని క్యాష్ చేసుకుంటేనే మేలు జరుగుతుందని ఆయన నేతలకు చెప్పినట్లు సమాచారం. మరోవైపు అధిష్టానం నేరుగా రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. వరుస బహిరంగ సభల ద్వారా పార్టీని క్రియాశీలకం చేయాలని భావిస్తున్నారు. కీలక నేతలు కొందరు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు చూస్తుండడంతో, ఇక ఇదే ఊపులో కష్టపడాలని సూచిస్తున్నారు. మరోవైపు మూడు అంశాల వారీగా సునీల్ తన సర్వే రిపోర్టు అందించినట్లు సమాచారం. దీంతో పాటు 36 స్థానాలో బలహీనంగా ఉందని, అక్కడ తీసుకోవాల్సిన ప్రణాళికలపై కూడా కొంత సమాచారం అందించినట్లు తెలిసింది.
ఏదేమైన టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అయ్యాక కాంగ్రెస్లో జోష్ వచ్చింది. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తో ఇక మరింత ఊపు తెచ్చింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలంతా కాంగ్రెస్ ను చూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను ఢీకొట్టాలంటే కాంగ్రెస్ నేత అయితే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను ఢీకొట్టాలంటే కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచి జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదులుకోరు. అందుకే కాంగ్రెస్ నేతలు కూడా అచితూచి అడుగులు వేస్తున్నారు. రైతాంగం, విద్యుత్ అంశంపై రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఎలా తమ పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారో అందరూ చూశారు. కాంగ్రెస్ బలోపేతం అవుతున్న మాట వాస్తవమే అయినా దానిని కాపాడుకునేందుకు ఆ పార్టీ నేతలంతా కలిసికట్టుగా శ్రమించాల్సిన అవసరం ఉంది. లేకుంటే కేసీఆర్ చతురత ముందు వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది.