Telangana Congress :
కర్ణాటక ఎన్నికలతో జోష్ నింపుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు దూకుడుగా ముందుకు సాగుతున్నది. తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులతో డీలా పడిన కాంగ్రెస్ ఈసారి అధికారాన్ని చేజిక్కించుకొని గత వైభవాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతున్నది .
పార్టీకి సంబంధించి కార్యక్రమాలను తెలంగాణ వేదికగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాలను ఇక్కడ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. పార్టీ అధినేత సోనియా గాంధీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా మరో ఆరు గ్యారంటీ స్కీంలతో ప్రజల మధ్యకు వస్తున్నారు.
విజయభేరి సభలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించింది. సభా వేదిక నుంచి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే ఆరు హామీలను ప్రకటించారు.
నాలుగు వర్గాలను లక్ష్యంగా చేసుకొని విజయ భేరి సభలో కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రకటించింది. మహిళలు, యువత, రైతులు, వృద్ధుల కోసం వీటిని ప్రకటించారు.
గతంలో కర్ణాటక ఎన్నికలల్లోనూ ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, తెలంగాణలో మరో హామీని జత చేసి ఆరు గ్యారెంటీలను ప్రకటించడం విశేషం.
మహాలక్ష్మి..
ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
రూ.500లకే గ్యాస్ సిలిండర్ . రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం .
రైతు భరోసా..
ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం
వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన
గృహజ్యోతి..
ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితం.
ఇందిరమ్మ ఇళ్లు ..
ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం
యువ వికాసం
విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ. 5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధనా పరికరాలు , స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సాయం. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు
చేయూత..
పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను . ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం. ఈ గ్యారెంటీలను రాహుల్ గాంధీ ప్రకటిస్తూ ‘‘కర్ణాటక మహిళలు ఇప్పుడు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అక్కడ మహిళలు మా జీవితాలు కాంగ్రెస్ పార్టీ మార్చిందని మాకు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చాక మహిళల జీవితాలను మారుస్తాం’’ అని చెప్పారు.
సంక్షేమమమే అస్త్రం..
కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకునేందుకు సంక్షేమాన్ని నమ్ముకుంది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అమలు చేసిన గ్యారంటీ స్కీంలకు వచ్చిన ప్రజాదరణ ఫార్ములా ను తెలంగాణలోనూ అమలు చేయాలని పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలకు సోనియా దిశా నిర్దేశం చేసారు.
కట్టు తప్పవద్దు
సీడబ్ల్యూసీ సమావేశాల్లో తొలి రోజున 14 అంశాలపై తీర్మానం చేసిన నేతలు..రెండో రోజు సమావేశంలోనూ పలు అంశాల పైన చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీ..సీఎల్పీ నేతలు హాజరయ్యారు. పార్టీలో క్రమశిక్షణను పాటించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారు. సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై రివ్యూ చేస్తూనే… 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల నుంచి నివేదిక కోరారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏఐసీసీ నేతల ప్రచారంపై త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని ఖర్గే తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశం ఎజెండాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు.