Congrees తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తు్న్న తరుణంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తూ విపక్షాలను ఊపిరి సలపకుండా చేస్తున్నారు. ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు.
ఇటీవల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ కమిటీ వేయడంతో సహా అనేక కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్న కేసీఆర్ తాజాగా రైతు లోకం పై మరో అస్త్రం ప్రయోగించారు. పంట రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
రుణమాఫీ కి ప్రకటనతో గా కాంగ్రెస్ లో కంగారు పుట్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించిన క్రెడిట్ ఇసుమంతైనా కేసీఆర్ ఖాతాలోకి వెళ్లకుండా ఉండేందుకు కాంగ్రెస్ నాయకులు ఒక వ్యూహాత్మక ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణాలను మాఫీ ప్రకటన కాంగ్రెస్ సాధించిన విజయమని అభివర్ణించడం చోద్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అనేక ఉద్యమాలు, పోరాటాల ద్వారా ఒత్తిడి చేసిన ఫలితంగానే ఇవాళ రుణమాఫీకి నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఇటీవల కలసి రుణమాఫీ గురించి డిమాండ్ చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.
ప్రజలకు మేలు చేసే ఒక మంచి పని జరుగుతున్నది అంటే దానికి సంబంధించిన క్రెడిట్ తమకంటే తమకు దక్కాలని రాజకీయ పార్టీలు పోటీపడుతుండడం సహజం. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ విషయంలో కూడా అదే జరుగుతున్నది. కేసీఆర్ ఇచ్చిన హామీ అమలులో ఆలస్యమైనా ఆయనే అమలులోకి తీసుకు వస్తున్నా క్రెడిట్ మాత్రం తమకు దక్కాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నది. నాలుగేళ్లలో రుణమాఫీ చేయకపోవడం కేసీఆర్ ప్రభుతత్వం అసమర్థత అని రేవంత్ నిందిస్తున్నారు.
ఎన్నికలు సమీపంలో ఉన్న ఈ తరుణంలో కేసీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అలాంటి అన్ని హామీల విషయంలోనూ తమ పోరాటాల ఫలితమే అని కాంగ్రెస్ ఎప్పటిలాగే ప్రకటించుకుంటుందా? కేసీఆర్ సర్కారు ఏ మంచి పని చేసినా క్రెడిట్ తమదే అని కొట్లాడుతారా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.