బీఆర్ఎస్ అభ్యర్థి: ఇంద్రకరణ్ రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత లేదు
బీజేపీ అభ్యర్థి విషయంలో క్లారిటీ రాలేదు
————————-
గ్రౌండ్ రిపోర్ట్ : నిర్మల్ బరిలో గెలిచేదెవరు?
గ్రౌండ్ రిపోర్ట్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోటీలో ఉంటారా?
గ్రౌండ్ రిపోర్ట్ : త్రిముఖ పోరు
———————–
Nirmal Constituency Review : నిర్మల్ నియోజకవర్గ ఓటర్లు విలక్షణ తీర్పునిస్తుంటారు. గత ఎన్నికల్లో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని బీఎస్పీ నుంచి గెలిపించారు. తరువాత ఆయన బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు నిర్మల్ లో రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా ఎవరు నిలుస్తారో తెలియడం లేదు. బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీహరి రావు మరోసారి బీఆర్ఎస్ టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ సిట్టింగులకే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఇంద్రకరణ్ రెడ్డి భరోసాగా మారింది.
ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కే కంచుకోటగా ఉండేది. ఇక్కడ చరిత్ర చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువ సార్లు గెలిచారు. 1952లో ఏర్పడిన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు, టీడీపీ నాలుగు సార్లు విజయం సాధించారు. 2014లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తరువాత బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొందారు.
నిర్మల్ నియోజకవర్గ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, దిలావర్ పూర్, లక్ష్మణచాంద, మామడ, సారంగపూర్, నర్సాపూర్ (జి), సోన్ మండలాలున్నాయి. 2.33 మంది ఓటర్లున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో ఇక్కడ ఏ పార్టీ విజయం సాధించాలన్నా వారి ఓట్లే కీలకం. ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ లో చేరిన తరువాత దేవాదాయ శాఖ మంత్రిగా నియమించారు.
ప్రస్తుతం మంత్రి మీద అసమ్మతి పెరుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీహరి రావు తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గత ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి మళ్లీ పోటీ చేయనని చెప్పి ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎలా పోటీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంద్రకరణ్ రెడ్డి తన కో డలికి టికెట్ ఇప్పించి తాను నాందేడ్ నుంచి పార్లమెంట్ కు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈసారి బీజేపీ తరఫున బరిలో నిలుస్తారనే వాదనలు వస్తున్నాయి. మహేశ్వర్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తరువాత కాంగ్రెస్ లో చేరి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ కన్వీనర్ గా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతో నోటీసులు కూడా అందుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం గమనార్హం.
బీజేపీ నుంచి డాక్టర్ మల్లికార్జున రెడ్డి కూడా బరిలో నిలుస్తారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు మాజీ మున్సిపల్ చైర్మన్ గణేష్ సైతం టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ నేత శ్రీహరి రావు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్త వినిపిస్తోంది. దీంతో నిర్మల్ నియోజకవర్గం రాజకీయ ముఖచిత్రం రంగు మారుతోంది. రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ లో గెలిచేదెవరు? నిలిచేదెవరని ఓటర్లు ఆలోచనలో పడిపోతున్నారు.