గ్రౌండ్ రిపోర్ట్: త్రిముఖ పోరు
అసెంబ్లీ నియోజకవర్గం: జూబ్లీహిల్స్
బీఆర్ఎస్: మాగంటి గోపీనాథ్
కాంగ్రెస్: విష్ణువర్ధన్ రెడ్డి, విజయా రెడ్డి
బీజేపీ: లంకాల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ
Jubilee Hills Constituency Review : హైదరాబాద్ జిల్లాలోని 15 శాసన సభ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. పేరు వినగానే గుర్తుకు వచ్చేది రిచ్ ఏరియా అని. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ ఏరియాలో ఉన్నట్లే స్లమ్ లు, బస్తీలు కూడా ఉన్నాయి. 2009 డీలిమిటేషన్ లో భాగంగా ఖైరతాబాద్ నుంచి ఈ నియోజకవర్గం ఏర్పడింది. హైదరాబాద్ లోని వార్డులు 6, 7, 8 (పాక్షికం)గా ఇందులో ఉన్నాయి. ఇప్పటికి ఈ నియోజకవర్గానికి మూడు సార్లు ఎన్నికలు జరగగా ఒక్కో పార్టీ గెలిచింది. అంటే జూబ్లీహిల్స్ ఓటర్లు అధికారాన్ని విడుతల వారీగా అప్పగిస్తున్నారన్నమాట.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ సారి పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. ప్రతీ సారి పార్టీని అభ్యర్థిని మారుస్తున్న నియోజకర్గం ఓటర్లు ఈ సారి ఏ పార్టీకి మద్దతిస్తారని చర్చలు కొనసాగుతున్నాయి. సాధారణంగా 2 సార్లు వేర్వురు పార్టీల నుంచి గెలుపొందిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఎదురుగాలి వీస్తోంది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నారు. సాధారణంగా ఇక్కడ మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది.
బీఆర్ఎస్
ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వేర్వేరు పార్టీల నుంచి రెండు సార్లు గెలుపొందారు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ లో చేరి 2018లో కూడా విజయం సాధించారు. రెండు సార్లు ఒకే వ్యక్తి ఉండడంతో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. దీనికి తోడు బాబా ఫసియొద్దీన్, రావుల శ్రీధర్ రెడ్డి నుంచి ఆయన తీవ్ర పోటీ ఉంది. బీజేపీలో యాక్టివ్ గా ఉన్న రావుల శ్రీధర్ రెడ్డి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సారి సీటు తమకంటే తమకంటూ వీరిద్దరూ పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్
గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభావం బాగా కనిపిస్తుంది. ఖైరతాబాద్ ను పీజేఆర్ దాదాపు 25 సంవత్సరాలు పాలించారు. అందులో కొంత కాలం జూబ్లీహిల్స్ భాగం కావడంతో ఇక్కడ సహజంగానే కాంగ్రెస్ కు మంచి పట్టు ఉంది. ఇక వీరికి ఇక్కడ కలిసి వచ్చే మరో అంశం మైనార్టీ ఓటర్లు. డీలిమిటేషన్ లో భాగంగా 2009లో జూబ్లీహిల్స్ ఏర్పడగా అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రస్తుతం ఆయన ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఖైరతాబాద్ లేకుంటే జూబ్లీహిల్స్ ప్రాంతం నుంచి టికెట్ ఆశిస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి సోదరి విజయా రెడ్డి. దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరిలో టికెట్ ఎవరికి వరిస్తుందో చూడాలి. ఇక, విజయా రెడ్డి రేవంత్ వర్గం కాగా.. విష్ణువర్ధన్ రెడ్డి వ్యతిరేక వర్గం.
బీజేపీ
జూబ్లీహిల్స్ లో బీజేపీ ఇప్పటి వరకు విజయం సాధించలేదు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీనికి కారణం ప్రధానంగా మైనార్టీలే అని తెలుస్తోంది. ఇక్కడ మైనార్టీ్ ఓటు బ్యాంకు ఎక్కువ అందుకే మేజార్టీల ఓట్లు చీలడం కూడా ఇక్కడ బీజేపీ కలిసి రావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి తోడు సరైన అభ్యర్థి కూడా లేకపోవడంతో ఈ సీటుపై బీజేపీ ఆశలు వదులుకుంటూ వస్తుంది. ఈ సారి ఈ స్థానం నుంచి దీపక్ రెడ్డి లేదా కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ ముగ్గురిలో ఒకరు పోటీలో నిలుస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరు నిల్చున్నా బీజేపీకి ఈ సీటు దక్కదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతీసారి పార్టీని మార్చే జూబ్లీహిల్స్ ఓటర్లు బీజేపీకి ఒక అవకాశం ఇస్తారు కావచ్చని ఆశతో పార్టీ నేతలు ఉన్నట్లు చర్చలు కొనసాగుతున్నాయి.