గ్రౌండ్ రిపోర్ట్ : ఇక్కడ మైనార్టీల ఓట్లే కీలకం
——————-
వైసీపీ అభ్యర్థి హఫీస్ ఖాన్
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్
కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత లేదు
బీజేపీ, జనసేన అభ్యర్థి పై కూడా క్లారిటీ లేదు
Kurnool Constituency Review రాయలసీమకు గుండెకాయలాంటిది కర్నూలు నియోజకవర్గం. ఇక్కడ నుంచే రాజకీయాలను శాసించిన వారున్నారు. ఇక్కడి ఓటర్లు ఇచ్చే తీర్పు విలక్షణంగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్ దే హవా. తెలుగుదేశం ఆవిర్భవించిన తరువాత 1983లో టీడీపీ విజయం సాధించింది. కానీ తరువాత మళ్లీ కాంగ్రెసే గెలుస్తూ వచ్చింది. 1994లో సీపీఐ గెలిచినా 1999లో మాత్రం సీపీఎం విజయం సాధించింది. దీంతో 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు తమ ఆలోచనలకు పదును పెడుతున్నాయి.
1955లో కర్నూలు నియోజకవర్గం ఏర్పడగా 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు, టీడీపీ 2 సార్లు, కమ్యూనిస్టులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి , స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలిచారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ విజయం సాధించింది. టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ టీడీపీ నుంచి పోటీ చేసినా వైసీపీ ముందు నిలవలేకపోయారు.
ప్రస్తుతం బీజేపీకి తగిన అభ్యర్థి లేడు. దీంతో జనసేన బలంతోనే బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోంది. జనసేనతో పొత్తు లేకపోతే ఏపీలో బీజేపీకి నష్టం భారీగానే ఉంటుందని గ్రహించిన అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది. పవన్ తో పొత్తుకే ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో రాణించాలంటే జనసేన బలం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మారనున్నట్లు తెలుస్తోంది.
కులాల పరంగా చూసుకుంటే ఇక్కడ మైనార్టీ ఓట్లే కీలకం. తరువాత స్థానాల్లో ఎస్సీ ఓటర్లుంటారు. పిదప రెడ్లు, వైశ్యులు వస్తారు. దీంతో వారి ఓట్ల కోసమే రాజకీయ పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. వారి ప్రాపకం కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో పథకాల రూపకల్పనకు నడుం బిగించాయి. ఓట్లు కొల్లగొట్టాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ కర్నూలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇక్కడ నుంచి ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలులో పాగా వేయాలని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రాయలసీమ రాజకీయాలను శాసించాలంటే కర్నూలులో కచ్చితంగా గెలవాల్సిందే. దీని కోసమే అన్ని పార్టీలు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల చూపు కర్నూలుపైనే ఉంది.