జగన్ మీద భరోసాతో వైసీపీ.. గత వైభవం కోసం టీడీపీ
ప్రొద్దుటూరులో నువ్వానేనా అన్నట్లుగా అధికార విపక్షాల పోరు
Proddatur Constituency Review : ఏపీ అధికార పార్టీ వైసీపీకి పట్టున్న జిల్లా కడప. సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో వైసీపీకి ఇక్కడ మంచి పట్టు ఉన్నది. అదే సమయంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి కూడా ఇక్కడ బలంగానే ఉన్నది. అధికార పార్టీతో నువ్వానేనా అన్నట్లుగా పోరు సాగుతున్నది. ప్రధానంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో గత రెండు పర్యాయాలుగా ఇక్కడ వైసీపీ గెలుస్తూ వస్తు్న్నది. అయితే ఇక్కడ టీడీపీ అధికార పార్టీకి సవాల్ విసురుతున్నది. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఈ సారి టీడీపీకి లాభించే అవకాశం ఉన్నది. అధికార పార్టీలోని అసంతృప్త నేతలను టీడీపీ చేర్చుకుంటూ తన బలాన్ని మరింత పెంచుకుంటున్నది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశం జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది.
సీఎం సొంత జిల్లా కావడంతో ప్రొద్దుటూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంటుంది. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రొద్దుటూరును 2014 నుంచి వైసీపీ తనకు అడ్డాగా మార్చకున్నది. 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలు వైసీపీకి తలనొప్పిగా మారాయి. కొద్ది రోజులుగా అధికార పార్టీలో అసమ్మతి కార్యక్రమాలు పెరుగుతూ వస్తున్నది. ఎమ్మెల్యే రాచమల్లు అందరినీ కలుపుకొని వెళ్తున్నానని చెప్పుకొస్తున్నాడు. కానీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో రాచమల్లు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వారిద్దరి మధ్య సఖ్యత లేదు.
అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ కాజాతోపాటు కొందరు కౌన్సిలర్లు ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కౌన్సిలర్లు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ వారిని బహిష్కరించింది. దాదాపు రెండు లక్షల ఓటర్లు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నారు. దాదాపు 1.60 లక్షల ఓట్లు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనే ఉన్నాయి. కౌన్సిలర్ల వ్యతిరేకతతో ఎమ్మెల్యేకు ముప్పు తప్పేలా లేదు. ఇది తమకు అనుకూలిస్తుందని టీడీపీ భావిస్తున్నది. టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యేకు దీటుగా పలు కార్యక్రమాలు చేపడుతూ టీడీపీలో జోష్ నింపుతున్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కట్టడి చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నది. ఓ కేసులో జైలుకు వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి.. తనను వైసీపీ టార్గెట్ చేసి అక్రమంగా ఇరికించిందని ఆరోపించారు.
దీంతో ఆయనకు నియోజకవర్గంలో సానుభూతి పెరిగింది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కడప సెంట్రల్ జైలుకు వెళ్లి ప్రవీణ్‌కుమార్‌ను పరామర్శించడంతోపాటు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా అతడిని ప్రకటించారు. దీంతో ప్రవీణ్‌కుమార్ నియోజకవర్గంలో తన జోరును మరింత పెంచారు. ప్రొద్దుటూరులో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. లోకేశ్ ప్రకటన తర్వాత లింగారెడ్డి స్తబ్దుగా ఉంటున్నారు.
మరో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కూడా టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో పార్టీని వీడిన ఆయన మాత్రం తాను ఎప్పుడూ టీడీపీలోనే ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. వరదరాజుల రెడ్డి ఈ సారి టీడీపీకి పనిచేస్తే వైసీపీలోకి వెళ్లిన ఆయన అనుచరులందరూ తిరిగి టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పెదనాన్న మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి కూడా టీడీపీలోకి రాబోతున్నట్లు తెలుస్తున్నది. బలమైన నాయకులంతా తిరిగి టీడీపీలో చేరితే ఇక్కడ తెలుగుదేశం గెలుపు సులువు అవుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
అయితే అధికార పార్టీలో విభేదాలు ఉన్నా.. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. టీడీపీ కూడా గెలుపుపై చాలా నమ్మకంతో ఉంది. దీంతో రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలూ నువ్వానేనా అన్నట్లు తలపడడం ఖాయం.