గ్రౌండ్ రిపోర్ట్ : సిర్పూర్ (టి)లో గెలుపు ఎవరిదో?
గ్రౌండ్ రిపోర్ట్ : కోనేరు కోనప్పను ఢీకొనే సత్తా ఉందా?
గ్రౌండ్ రిపోర్ట్ : ప్రతిపక్షాలు చక్రం తిప్పుతాయా?
————————
బీఆర్ఎస్ అభ్యర్థి : కోనేరు కోనప్ప
బీఎస్పీ అభ్యర్థి : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
బీజేపీ అభ్యర్థి: పాల్వాయి హరీష్ బాబు
కాంగ్రెస్ అభ్యర్థి: రావి శ్రీనివాస్
చతుర్ముఖ పోరు
జనరల్ నియోజకవర్గంలో పోటీ రసవత్తరం
———————–
Sirpur (T) Constituency Review: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ (టి) నియోజకవర్గం ప్రత్యేకత కలిగినది. స్వతంత్రులకు స్థానం కల్పించిన నియోజకవర్గంగా దీనికి పేరుంది. వలస వచ్చిన వారితో మినీ ఇండియాగా పేరుపొందిన నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయనేది ఆలోచనాత్మకమే. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ (టి) నియోజకవర్గం ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ప్రాంతం.
సిర్పూర్ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రెండు సార్లు వరుసగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా నెగ్గి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. 1957 నుంచి 1978 వరకు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. 1983, 1985లో టీడీపీ పార్టీ నుంచి కేవీ నారాయణ రావు ఎన్నికయ్యారు. 1989 వరకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటగా మారింది.
1989లో పాల్వాయి పురుషోత్తమరావు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 1994లోను ఇండిపెండెంట్ గానే నిలిచారు. తరువాత 1999 ఎన్నికల సమయంలో ఎలక్షన్ మూడు రోజులు ఉందనగానే మావోయిస్టులు ఆయనను చంపారు. దీంతో ఆయన సతీమణి పాల్వాయి రాజ్యలక్ష్మి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కోనేరు కోనప్ప విజయం సాధించారు.
2009 తెలంగాణ ఉద్యమ సమయంలో కావేటి సమ్మయ్య బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన సమ్మయ్య 2010 ఉప ఎన్నికలోనూ విజయం వరించింది. 2014లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేసిన కోనేరు కోనప్ప అందరి అంచనాలు తలకిందులు చేస్తూ విజయం సాధించారు. తరువాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని పార్టీలో కలిశారు.
తాజాగా రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ బాబు, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్, బరిలో నిలవనున్నారు. కోనేరు కోనప్పను ఢీకొనాలంటే వీరి బలం సరిపోతుందా? వీరి వ్యూహాలు ఏంటి? ఎన్నికల బరిలో నిలిచే పార్టీల బలాబలాలపై పార్టీలు ఏ మేరకు కసరత్తు చేస్తాయో తెలియడం లేదు.
కోనేరు కోనప్ప చేపడుతున్న సంక్షేమ పథకాలే ఆయనకు రక్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. వేసవి కాలంలో అంబలి పంపిణీ చేయడం చేస్తుంటారు. అన్ని కాలాల్లో పేదవారికి అన్నదానం పెడుతుంటారు. ఇలా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనప్పను ఢీకొనే సత్తా ప్రతిపక్షాల అభ్యర్థుల్లో ఉందా అని పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
బీఎస్పీకి పట్టున్న ప్రాంతం కావడంతోనే కోనేరు కోనప్ప ఇక్కడి నుంచి బీఎస్పీ తరఫున గెలుపొందారు. ఇప్పుడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ నుంచి పోటీకి దిగుతానని ప్రకటించడంతో రాజకీయ ముఖచిత్రం మారనుంది. మొదటి నుంచి ఇక్కడ పట్టు సాధించిన బీఎస్పీ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ పోటీతో మిగతా పార్టీల నేతల్లో భయం పట్టుకుంది.
పోటీ వీరిద్దరి మధ్యే
అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈ నియోజకవర్గం నుంచి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ చేయడం ఖాయం. అలాగే ఈ నియోజకవర్గంలో బీఎస్పీకి కూడా ప్రధాన పార్టీలకు సమాంతరంగా పట్టు ఉన్నది. ఇక్కడ ఎక్కువగా ఎస్టీలు, ఎస్సీలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన కోనప్ప అనూహ్యంగా విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ గురుకులాల రాష్ర్ట ఇన్ చార్జీగా అప్పటి ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరించారు. అలాగే గురుకులాల్లో స్వేరోస్ అనే సంస్థను స్థాపించారు. స్వేరోస్ సంస్థ రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో పని చేస్తున్నది. ఇందులో ఎక్కువగా ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ప్రవీణ్ కుమార్ కు స్వేరోస్ బాధ్యులు ఏకపక్షంగా మద్దతు పలికే అవకాశం ఉంది. దీంతో తాను సులువుగా గెలుస్తానని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నారు. దీంతో ప్రధానంగా ప్రస్తుత ఎమ్మెల్యే కోనప్ప, బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్యనే ఉండనుంది.