బీఆర్ఎస్ అభ్యర్థి: జగదీష్ రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి: స్పష్టత లేదు
బీజేపీ అభ్యర్థి: సంగినేని వెంకటేశ్వర్ రావు
———————–
గ్రౌండ్ రిపోర్ట్ : సూర్యాపేటలో గెలిచేదెవరు?
గ్రౌండ్ రిపోర్ట్ : బీఆర్ఎస్ లో కనిపించని వర్గపోరు
గ్రౌండ్ రిపోర్ట్ : త్రిముఖ పోరు
———————–
Suryapet Constituency Review : చుట్టు ముట్టు సూర్యపేట నట్టనడుమ నల్లగొండ అని పాడుకుంటారు. నిజాం కాలం నుంచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డగా పేరు తెచ్చుకుంది. 1957లో సూర్యాపేట నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ పార్టీల బలాబలాలు చూస్తే కాంగ్రెస్, టీడీపీలు నువ్వా నేనా అన్నట్లు గెలిచాయి. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ హవా సాగుతోంది. మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గం గురించి ఇప్పుడు అందరి ఫోకస్ పడింది.
కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ మూడు సార్లు ఇక్కడ గెలిచాయి. 2009లో నియోజకవర్గాల పునరేకీకరణలో ఈ నియోజకవర్గం జనరల్ గా మారింది. ఇక్కడ మొదటి ఎమ్మెల్యేగా భీంరెడ్డి నరసింహారెడ్డి పీడీఎఫ్ పార్టీ నుంచి గెలుపొందారు. 1957 నుంచి 2004 వరకు ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. 2009లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.
తెలంగాణ ఏర్పడ్డాక 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. ఇప్పుడు కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. జగదీష్ రెడ్డి చేసిన పనులే ఆయనను గెలిపిస్తాయని కార్యకర్తలు అంటున్నారు. నియోజకవర్గంలో పనులు పరుగులు పెట్టిస్తున్నారనే టాక్ కూడా ఉంది. గతంలో రెండుసార్లు స్వల్ప మెజార్టీతోనే బయటపడ్డ ఆయనకు కాంగ్రెస్ పార్టీ వర్గపోరు ప్లస్ అవుతుందని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరుతో బీఆర్ఎస్ కు లాభం కానుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డికే టికెట్ ఖాయమనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాంరెడ్డి దామోదర్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి లు వేరువేరుగా కార్య్రక్రమాలు చేస్తుండటంతో వర్గపోరు స్పష్టంగా కనిపిస్తోంది.
బీజేపీ నుంచి సంగినేని వెంకటేశ్వర్ రావు పోటీకి రెడీ అవుతున్నారు. రెండు దశాబ్దాలుగా ఇక్కడ బోణీ కొట్టాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇంకా బూరనర్సయ్య గౌడ్ కూడా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్నా నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే మిగిలిపోయాయని అంటున్నారు. దీంతో ఈసారి జగదీష్ రెడ్డికి ఓటమి తప్పదని చెబుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పినా ఒక ఎకరం కూడా తడవలేదంటున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట బరిలో గెలిచేదెవరు? నిలిచేదెవరు? అనేది తేలాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.