గ్రౌండ్ రిపోర్ట్ : కొల్లాపూర్ లో గెలుపు ఎవరిది?
గ్రౌండ్ రిపోర్డ్: మామిడి తోటలకు ప్రసిద్ధి చెందినది
గ్రౌండ్ రిపోర్ట్: త్రిముఖ పోరు
———————-
బీఆర్ఎస్ అభ్యర్థి: బీరం హర్షవర్దన్ రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి : స్పష్టత లేదు
బీజేపీ అభ్యర్థి: సుధాకర్ రావు
జూపల్లి క్రిష్ణారావు ఏ పార్టీలో చేరతారో తెలియడం లేదు
————————–
Kolhapur Constituency Review: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గం ఉంది. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. క్రిష్ణానదీ తీరం ఈ జిల్లాకు అందాలు తీసుకొస్తుంది. మామిడితోటలు అలంకార ప్రాయంగా కనిపిస్తాయి. జిల్లాలో ఉన్న సోమేశ్వర ఆలయం భక్తుల కోరికలు తీరుస్తుంది. ఇక్కడ ప్రధాన నేతగా జూపల్లి క్రిష్ణారావు ఉంటారు. దీంతో ఇప్పుడు రాజకీయ సమీకరణలు ఎటు వైపు తిరుగుతాయో తెలియడం లేదు.
బీఆర్ఎస్ తిరుగుబాటు నేతగా జూపల్లి ఎటు వైపు వెళ్తారో అర్థం కావడం లేదు. జూపల్లిని తమ పార్టీలోకి తీసుకోవాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి ఒకే మారు తిరుగుబాటు జెండా ఎగరేయడంతో జూపల్లి దారెటు అనేది అంతుచిక్కడం లేదు. అవసరమైన సమయంలో తన నిర్ణయం ప్రకటిస్తానని జూపల్లి అంటున్నారు. పొంగులేటి మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ జూపల్లి మాత్రం ఇంకా ఏ పార్టీలో చేరలేదు.
జూపల్లి క్రిష్ణారావు 1999 నుంచి 2014 వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఉద్యమంలో పాల్గొని ఎన్నో సేవలందించారు.2018లో బీరం హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైషమ్యాలు పెరిగాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్గం పదకొండు స్థానాలు గెలుచుకోగా ఎమ్మెల్యే వర్గం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో ఎమ్మెల్యే వర్గం చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది.
ఇక అప్పటి నుంచి ఎమ్మెల్యే, జూపల్లి మధ్య వర్గపోరు నడుస్తోంది. పార్టీ నుంచి జూపల్లి సస్పెన్షన్ కు గురయ్యాక తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీవిజయం సాధించడంతో కాంగ్రెస్ లో చేరికకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బీజేపీ కూడా చురుకుగానే ఉంది. కొల్లాపూర్ జెండా ఎగరేయాలని బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావు ప్రయత్నాలు ప్రారంభించారు. కొల్లాపూర్ కు జాతీయ రహదారి తీసుకురావడంలో బీజేపీ పాత్ర ఉందని చెబుతున్నారు.
కాంగ్రెస్ నుంచి నలుగురు పోటీలో ఉన్నారు. అభిలాష్ రావు, జగదీశ్వర్ రావు, కేతూరి వెంకటేశ్, తిరుపతమ్మ గౌడ్ రంగంలో ఉన్నారు. మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్ లో రాజకీయ పార్టీల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక్కడ వాల్మీకి, బోయలు ఎక్కువగా ఉన్నారు. వారిని ఎస్సీల్లో చేర్చుతామని హామీ కలగానే మిగిలింది.
నియోజకవర్గంలో జూనియర్ కళాశాలల జాడలేదు. బీఆర్ఎస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి లైన్ లో ఉండటంతో పోటీఇద్దరిలోనే ఉంటుందని భావిస్తున్నారు. కానీ బీజేపీ కూడా రంగంలో ఉంటే త్రిముఖ పోరు ఉండనుంది. బీరం పనితీరు బాగానే ఉందని స్థానికులు చెబుతున్నారు. కానీ జూపల్లి రంగంలో నిలిస్తే పోటీ తీవ్రంగానే ఉండనుంది. జూపల్లి ఎందులోకి వెళతారో తెలియడం లేదు.