
CPI Narayana : కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ విజయం తిరుగులేనిదని, ఇంత పెద్ద విజయం ఊహించలేదని పార్టీయే ఆశ్చర్యానిక గురైన సందర్భాలు ఉన్నాయి. ఈ ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఆయా పార్టీల కీలక నేతలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంవంగా మారాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల గడువే ఉండడంతో ఆయన పొత్తుల గురించిన అంశాలను తెరమీదకు తెచ్చారు. సీపీఐ భవిష్యత్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు.
‘కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కొత్త పొత్తు ఆప్షన్ ఉందని’ సీపీఐ కార్యదర్శి నారాయణ అన్నారు. సీపీఐతో కలిసి పని చేసే విషయంలో గతంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మౌనంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రత్యామ్నాయాలు వెతికే ముందు ఆయన స్పందన కోసం కొన్ని రోజులు వేచి చూస్తామన్నారు. గత నవంబర్ లో నిర్వహించిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎం బీఆర్ఎస్‌కు మద్దతు తెలిపింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు బీఆర్ఎస్ వామపక్షాల మద్దతు కోరింది. మునుగోడులో గణనీయమైన కేడర్ ఉన్నా వామపక్షాల మద్దతు ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందని విస్తృతంగా విశ్వసిస్తున్నారు.
మునుగోడులో వామపక్ష పార్టీల నేతలతో కలిసి 2 బహిరంగ సభల్లో పాల్గొని నారాయణ మాట్లాడారు. బీజేపీని ఓడించేందుకు అందరితో కలిసి పని చేస్తామని ప్రకటించారు. ఇక ఆ ఉపఎన్నిక తర్వాత వామపక్షాలతో కలిసి పనిచేసేందుకు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి చొరవ రాకపోవడంతో ఆ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మిత్రపక్షాలను ఎంపిక చేసుకునేందుకు తమకు కొత్త ఆప్షన్లు ఉన్నాయని నారాయణ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడంపై బీఆర్ఎస్ నుంచి స్పందన రాకపోతే వామపక్షాలు కాంగ్రెస్‌తో చేతులు కలవ వచ్చనే ఊహాగానాలకు తెరలేపాయి. నారాయణ పొత్తుల అంశంపై రాజకీయాల్లో ఇప్పుడు చర్చగామారింది.