- అదాని తదితర కార్పొరేట్లకు ఆగమేఘాలపై వేలాది ఎకరాలకు భూములు
- నత్తనడకన సాగుతున్న పేదల పట్టాలు మంజూరు
- వాంబే కాలనీ డిస్నీల్యాండ్ లో జనావాసాల మధ్య కబేళా ఏర్పాటు
- సుదూరంలో పేదలకు ఇళ్ల స్థలాలు
- పట్టాల పేరుతో డబ్బులు వసూళ్లు, పట్టాల మంజూరులో కాలయాపన
- ఫిబ్రవరి 18వ తేదీన ఇళ్లు, పట్టాలకై వాంబేకాలనీలో 24 గంటల నిరసన దీక్ష
- వాంబే కాలనీలో సిపిఎం పాదయాత్ర, సభలు
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్రీదేవి

CPM Padayatra : నేడు విజయవాడ వాంబే కాలనీలో సిపిఎం కార్యకర్తలు పేదలకు ఇళ్లు, పట్టాలు కోరుతూ,డిస్నీలాండ్ లో కబేళా ఏర్పాటు ఆపాలని, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు, పలు ప్రాంతాలలో స్థానిక ప్రజలతో సభలు జరిపి వారి సమస్యలు తెలుసుకున్నారు
18వ తేదీన నిరసన దీక్షకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాబురావు, శ్రీదేవి తదితర నేతలు మాట్లాడుతూ.. పదేళ్ల మోడీ పాలన, ఐదేళ్ల జగన్ పాలనలో ఇళ్లు, పట్టాలంటూ పేదలకు ఆశలు చూపి మోసగించారు. ఇళ్లు లేని పేదలు లేకుండా చేస్తామని నమ్మించారు, కాగితాలతో సరిపెట్టారు, అద్దెకు ఉన్న వారికి స్థలాలు కూడా చూపలేదు. ఇళ్ల నిర్మాణం పేరుతో లబ్ధిదారుల వద్ద నుండే డబ్బు వసూలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. కొన్ని చోట్ల అసంపూర్తిగా మిగిలిపోయాయి.
ఎన్నికలు రాబోతున్న సమయంలో స్థలాలకు రిజిస్ట్రేషన్ పేరుతో మరో సరికొత్త నాటకానికి వైసీపీ ప్రభుత్వం పూను కుంటున్నది. గత 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్న వాంబే కాలనీ వాసులకు రిజిస్ట్రేషన్ పట్టాలిస్తామని ఆశలు. చూపి వేలాది రూపాయలు డబ్బు వసూలు చేశారు. ఉచిత పట్టాల వాగ్దానానికి ఎసరు పెట్టారు. డబ్బు వసూలు చేసి ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నప్పటికీ పట్టాల పేరుతో కాలయాపన చేస్తున్నారు. మరోసారి ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు.
గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఇదేవిధంగా పట్టాల పేరుతో డబ్బు వసూలు చేసి శూన్య హస్తం చూపించింది. డిస్నీలాండ్ లోని 57 ఎకరాల ప్రభుత్వ స్థలం వృధాగా ఉన్నప్పటికీ పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించకుండా, పశువులను వధించడానికి కబేళా ఏర్పాటు చేయడం అమానుషం. బడా కంపెనీలకు కబేళా పేరుతో డిస్నీలాండ్ స్థలాన్ని కట్టబెట్టడానికి పాలక పార్టీ నేతలు, నగరపాలక సంస్థ కుట్ర పన్నింది. జనావాసాల మధ్య కబేళా నగరానికి సుదూర ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేయడం హాస్యాస్పదం. గతంలో కార్పొరేషన్ లో వామపక్షాల పాలనలోనూ, సిపిఎం నేతలు కార్పొరేటర్ గా ఉన్న సమయంలో అజిత్ సింగ్ నగర్ నుండి కండ్రిక వరకు నామమాత్రపు ధరలకే పట్టాలు పంపిణీ చేశారు.
నేడు రాష్ట్ర ప్రభుత్వంలో వైసిపి ఉన్నా పట్టాలు ఇవ్వకుండా ప్రజలను మోసగిస్తున్నారు. నేడున్న వైసిపి, గతంలోని టిడిపి శాసనసభ్యులు ప్రభుత్వాలు పట్టాల పేరుతో స్థానికులను మోసగించాయి. తిరిగి అధికారం పొందటానికి వైసీపీ, బీజేపీ,టీడీపీలు సిద్ధమవుతుండగా ఇళ్లు, పట్టాల కొరకు పేదలు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 18వ తేదీన పేదలకు డిస్నీలాండ్ లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని, గతం నుండి నివసిస్తున్న వారందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలను తక్షణమే ఇవ్వాలని, రైల్వే నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ ఈ నెల 18వ తేదీన జరిగే 24 గంటల దీక్షను జయప్రదం చేయాలి. పాలకులను నిలదీయాలి. నేడు జరిగిన పాదయాత్ర, సభలలో సిపిఎం నేతలు బి.రమణరావు, కే.దుర్గారావు, పీర్ సాహెబ్, ఓంకార్, రంగస్వామి, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.