AP : ఏపీలో పాలన అత్యంత హీన స్థాయికి చేరినట్లుగా కనిపిస్తున్నది. ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమ దారికి రానివారిని ప్రభుత్వం వేధిస్తున్న తీరు అత్యంత హేయంగా ఉంది. ఇక ప్రతిపక్ష నాయకులను వరుసగా జైళ్ల పాలు చేస్తూ సంబురం చేసుకుంటున్నది. గత ప్రభుత్వాల తీరుకు భిన్నంగా ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం నడుస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు వ్యతిరేకమని తెలిస్తే చాలు.. ఇక నయానో భయానో దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏకంగా సీఎంవో పైనే విమర్శలు వచ్చాయి. దీంతో ఏపీ సీఐడీ రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఏపీ సీఎం జగన్ రెడ్డి కి సంబంధించిన డిజిటల్ సంతకాలను ఆరు నెలలుగా దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఇందులో అటెండర్ల పాత్ర ఉన్నట్లు ప్రాథమిక అంచనా. సైబర్ క్రైమ్ వింగ్ కూడా ఇదే తేల్చినట్లు టాక్. అయితే ఏకంగా సీఎం కార్యదర్శుల యూజర్ నేమ్, పాస్ వర్డులు అటెండర్లకు తెల్వడం విస్తుగోల్పుతున్నది. సీఎంవో అంటే అత్యంత కట్టుదిట్టమైన కార్యాలయం. ఇక్కడి నుంచి ఒక్క చిన్న చీపురు పుల్ల కూడా బయటకు పోదు. చిన్న విషయం కూడా బయటకు పొక్కదు. అలాంటి సీఎంవోలో దర్జాగా సీఎం సంతకాన్ని వాడేస్తున్నారంటే ఏపీలో పాలనపై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే ఇదంతా ఏపీ సీఎం జగన్ కు తెల్వకుండా జరగుతుందా అనేది అనుమానమే. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ కోసం సీఎం డిజిటల్ సంతకాన్ని వాడినట్లు తెలుస్తున్నది. అయితే పూర్తి విచారణ జరిగితే కాని దీని వెనుక ఉన్న ముఖ్య కుట్రదారులు ఎవరనేది బయటకు రాదు. పూర్తి స్థాయి అవగాహన ఉన్న అధికారులకు సాధ్యం కాని ఈ తతంగం అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఎలా సాధ్యమైందనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇప్పుడు ఏపీలో పాలన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా సీఎం సంతకం వాడేవరకు వెళ్లారంటే ఇక ఆ కార్యాలయంలో ఎంత మంది అక్రమార్కులు ఉన్నారోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.