Vakkaya:
సాగు నీటి తడులు అక్కర్లేదు. అంతా వర్షాధారమే. చీడపీడల బెడద లేదు. పంటను పశువులు తింటాయన్న భయమూ లేదు. దీని కొమ్మలకే ముళ్లుంటాయి కాబట్టి వేరే కంచె వేసే ఖర్చూ లేదు. మొక్కలు నాటిన మూడో ఏడాది నుంచి కాయలు కోసి అమ్ముకోవడమే! కోత కూలి తప్ప మరే ఖర్చూ లేదు. సుధీర్ఘ కాలం పంట తీసుకుంటూనే ఉండవచ్చు.
కంచెగా ఉపయోగపడుతుందని..
బాపట్ల జిల్లా కొరిశపాడుకు చెందిన కడివేటి జగన్నాథరెడ్డి కొన్నేళ్ల క్రితంకాశీకి వెళ్లాడు. అప్పుడు అక్కడినుంచి కొన్ని మొక్కలు తీసుకువచ్చాడు. వాటిలో ఒకటి వాక్కాయ మొక్క. ఈ చెట్టుకు తీగకు ముళ్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పొలం గట్టుపై వేస్తే కంచెగా మారుతంది. జగన్నాథరెడ్డి సోదరుడు విశ్వనాథరెడ్డి తన పొలంలో గట్టుపై నాటాడు. పెరిగాక దాని కాయలను విత్తనాలుగా మార్చి ఎకరం పొలంలో సాగు చేశాడు.
లాభాలు రావడంతో ప్రస్తుతం 12 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఎకరాకు 200 వరకు మొక్కలు నాటవచ్చు. తొలి ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నా చెట్టు పెరిగే కొద్దీ దిగుబడి పెరుగుతుంది. రెండేళ్ల తరువాత ఒక్కో చెట్టు నుంచి 25 నుంచి 30 కిలోల కాయలు వస్తాయి. ఎకరాకు సుమారు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ధర కిలో రూ.50 ఉంది. అడవి జాతి మొక్క కావడంతో ఖర్చు కూడా తక్కవే. ఏడాదికి రెండు మూడుసార్లు నీరందిస్తే చాలు. పూత సమయంలో పురుగు సోకకుండా మందులు పిచికారీ చేస్తే దిగుబడి పెరుగుతుంది. బేకరీ పదార్థా్లో వాడే చెర్రీ పండ్లను వీటితోనే తయారు చేస్తారు.
విజయవాడ, కోల్‌కతా నుంచి వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కొరిశపాడుకు చెందిన మహిళా రైతు ఎం.సునందన తమ పొలంలో పండిన వాక్కాయలతో పచ్చళ్లు తయారుచేస్తున్నారు. చింతపండుకు వీటిని ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.
జగన్నాథ రెడ్డి సాగు చేస్తున్న వాక్కాయ పంటన గమనించిన స్థానిక రైతులు కూడా వీటి సాగుపై ఆసక్తి చూపారు. ఇదే రైతులు తమ చుట్టు పక్కల వాళ్లకు అందించారు. ప్రస్తుతం గుంటూరు, ప్రకాశం జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు ఉచితంగా వాక్కాయలను ఏటా అంందిస్తున్నారు. చెట్టు నుంచి కాయలు కోసేందుకు యంత్రాన్ని తయారుచేయాలని గతంలో శాస్త్రవేత్తలను కోరారు.. ఆ యంత్రం వస్తే కూలీ ఖర్చు తగ్గి మరిన్ని లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు.
ఉపయోగాలు
వాక్కాయలను కాన్ బెర్రీస్ అని కూడా అంటారు. వీటిలో మధుమేహాన్ని నివారించే ఎన్నో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వాక్కాయ వగరుగా పుల్లగా ఉంటుంది. ఇండియన్ క్రాన్ బెర్రీస్ పిలుస్తుంటారు. మూత్రపిండాలలో రాళ్లని కరిగిస్తాయి. మూత్ర నాళాలని శుభ్రపరుస్తాయి. విటమిన్ సీ అధికంగా ఉన్న ఈ వాక్కాయ అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లా మేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఉబ్బసం చికిత్స నుంచి చర్మ వ్యాధుల వరకు, వాక్కాయలు శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి.