Cyclone in AP : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గురువారం ఉదయం వరకు తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణశాఖ పేర్కొంది. అనంతరం రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలను తాకుతుందని ఐఎండీ పేర్కొంది. తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపెట్టై, చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుపానుకు ‘ఫెన్ గల్’గా నామకరణం చేశారు.
దీని ప్రభావంతో గురువారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. శుక్రవారం వరకు తుపాను కొనసాగుతుందని, శనివారం తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొంది. రాబోయే మూడు మూడు రోజుల్లో కోస్తాంధ్ర తీరంలో గరిష్ఠంగా గంటకు 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణశాఖ చెప్పింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.